సిరి సంస్థకు ఎన్జీవో 2024 అవార్డు

Mar 7,2024 14:04 #Kakinada

ప్రజాశక్తి-సామర్లకోట :  గత 30 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మానసిక వికలాంగులకు ఉచితంగా ప్రత్యేక విద్య ఉపాధి కల్పిస్తున్న సామర్లకోట సిరి మానసిక వికలాంగుల పాఠశాలకు ఇండియాలో 2024లో టాప్ 20 బెస్ట్ ఎన్జీవో అవార్డు గెల్చుకుంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవల న్యూఢిల్లీలోని హయత్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో శ్రీ సంస్థ డైరెక్టర్ టాప్ 20 బెస్ట్ ఎన్జీవో అవార్డును నిర్వాహకులు రోహన్ మదన్ శివాని కపూర్లు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ విషయాన్ని సిరి సంస్థ డైరెక్టర్ డి గోపిదేవి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ సంస్థ గత 30 సంవత్సరాలుగా మానసిక శారీరక వికలాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ స్పీచ్ తెరపి బిహేవియర్ మోడిఫికేషన్ లలో తర్ఫీదు ఇ స్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తమ సంస్థకు జాతీయస్థాయిలో ఉత్తమ ఎన్జీవో గా అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డుతో మా సంస్థ సిబ్బంది బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఇప్పటివరకు తమ సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు స్వచ్ఛంద సంస్థల నుండి 12సార్లు ఉత్తమ సేవా అవార్డులు అందుకోవడం జరిగిందన్నారు. తమ సంస్థ సేవలను కొనియాడుతూ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ లేఖ పంపినట్లు చెప్పారు. మానసిక వికలాంగ మహిళల అన్యాయాలకు గురికాకుండా రక్షణ కల్పించాలన్న సదుద్దేశంతో తమ సిరి సంస్థను నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఉత్తమ ఎన్జీవో అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు గోపిదేవిని అభినందించారు.

➡️