డీఆర్డీఏ కార్యాలయం వద్ద వెలుగు వివోఏలు ధర్నా

Jan 5,2024 17:38 #Protest, #VOA
vra protest in kakinada

 

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : ఏపీ వెలుగు వివోఏ (యానిమేటర్లు) ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం కాకినాడ డిఆర్డిఏ కార్యాలయం వద్ద వివోఏలు ధర్నా నిర్వహించారు. విఓఏల 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దుచేయాలన, సిబిఓహెచ్ఆర్ పాలసి అమలు చెయ్యాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, విఓలమెర్జ్ ఆపాలని, అన్నిరకాల బకాయిలు చెల్లించాలని నినాదాలు చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి ధర్నా కొనసాగుతోంది. ఈ సందర్భంగా వివోల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి. మేరీ, డి.మేరీ, సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేష బాబ్జి మాట్లాడుతూ విఓఎ ల ఉపాధిని దెబ్బతీసే 3 సంవత్సరాల కాలపరిమిత సర్క్యూలర్ రద్దుచేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సమాఖ్యల మెర్జ్ ఆపాలని, సంఘాలను విడగొట్టడం కలపడం వంటి పనులు సెర్ఫ్ అధికారులే చేశారని విమర్శించారు. విఓఏల మెర్జ్ చేయడం వలన వేలాది మంది విఓఏలు ఉపాధికి దూరమవుతున్నారన్నారు. ఇది మానవ వనరులకు విఘాతం కలిగించటమే అని మండిపడ్డారు. విఓఏల ఉపాధికి నష్టంలేకుండా విఓల మెర్జ్ ను ఆపి, ఎక్కువ సంఘాలున్న విఓల నుండి తక్కువ సంఘాలున్న విఓలకి సర్దుబాటు చేయాలని, ఎటువంటి రాజకీయ జోక్యం ఉండకుండా చూడాలని డిమాండ్ చేసారు.ఇప్పటి వరకు 15 సంఘాల లోపు ఉన్న విఓలు, వివోఏలకు వేతనాలు  చెల్లించలేదన్నారు. ఉపాధి కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, వయసు పైబడిన వారికి, అనారోగ్యంతో ఉన్నవారికి, వారి కుటుంబ సభ్యులకు విఓఏ లుగా అవకాశం కల్పించాలని, జెండర్, వయస్సు, చదువు పేరుతో తొలగింపులు ఆపాలని కోరారు. పిడి శ్రీరమణి వచ్చి తమకు సమాధానం చెప్పాలని, అక్రమంగా తొలగించిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంఘం నాయకులు గంగా భావనీ, ఈశ్వరీ భాయ్, ఎస్.పద్మ తదితరులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు.

➡️