కొత్త క్రిమినల్‌ చట్టాలపై అవగాహన అవసరం

May 22,2024 23:47 #news criminal rules
New criminal rules

ప్ర‌జాశ‌క్తి – గ్రేట‌ర్ విశాఖ బ్యూరో అందరికీ న్యాయం అందించడం కోసం సమకాలీన, సాంకేతికతలకు అనుగుణంగా పలు అంశాలను పొందుపరిచి జులై 1 నుంచి దేశంలో అమలు కానున్న మూడు కొత్త క్రిమినల్‌ చట్టాలపై అవగాహన అందరికీ అవసరమని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. విశాఖలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో (పిఐబి) ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యాన దేశంలో జులై 1 నుంచి అమలులోకి రానున్న 3 క్రిమినల్‌ చట్టాలపై బుధవారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌నకు అదనపు డైరెక్టర్‌ జనరల్‌ (పిఐబి) రాజిందర్‌ చౌదరి అధ్యక్షత వహించారు. సమావేశంలో ఏపి రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి, మాజీ ఐజి ఆఫ్‌ పోలీస్‌ ఇ దామోదర్‌ ప్రసంగిస్తూ సవరించిన క్రిమినల్‌ చట్టాలు మారుతున్న కాలానికి అనుగుణంగా నవీకరించబడ్డాయన్నారు. క్రిమినల్‌ చట్టాల మైక్రో నైపుణ్యాలను కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సమాజానికి వాటి ఆచరణాత్మక ఉపయోగం చుట్టూ జరుగుతున్న నేరాల గురించి వివరించారు. కొత్త చట్టాల్లో పేర్కొన్న కమ్యూనిటీ సేవల శిక్షలు మనకు ఇంతకు పూర్వం పూర్తిగా తెలియనివి అన్నారు. కొత్త చట్టాల వర్తింపు నేరాలు, దానికి సంబంధించిన కేసులతో వ్యవహరిస్తున్నప్పుడు వాటిని ఎలా గ్రహించాలనే విషయంపై జోన్‌ల వారీగా రాష్ట్రంలో పోలీసు అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ నందిని సిపి మాట్లాడుతూ, మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలు, వాటి దర్యాప్తు ప్రక్రియ ఎఫ్‌ఐఆర్‌లు ఇతర ఫిర్యాదుల ద్వారా నేరాల నమోదు అరెస్టులు, కస్టడీ, బెయిల్‌, శిక్షకు సంబంధించిన విధానం బాధితుల ప్రక్రటిత నేరస్తుల అంశాలపై ప్రసంగించారు. ఈ క్రమంలోనే డిజిటల్‌ ఎలక్ట్రానిక్‌ సాక్ష్యాలు, కంప్యూటర్‌, కమ్యూనికేషన్‌ పరికరాల ప్రధాన అంశాలలో నేరాన్ని నిర్ణయించే క్రమంలో రుజువుల ప్రమాణంగా తీర్పులు ఆమోదించే సమయంలో ఒప్పుకునే రికార్డు చేయడం కూడా ప్రాధాన్యతతో కూడుకున్నదని ఆమె చెప్పారు. ఈ కొత్త క్రిమినల్‌ చట్టాల ప్రవేశంతో సాక్ష్యాలు ఒక ప్రాంతానికో ఒక ప్రదేశానికో పరిమితం కాకుండా కీలకపాత్ర పోషించనున్నాయని తెలిపారు. వర్క్‌షాప్‌నకు అధ్యక్షత వహించిన రాజిందర్‌ చౌదరి మాట్లాడుతూ, పత్రికా సమాచార కార్యాలయం, ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని మీడియా ద్వారా ప్రజలకు అందించడంలో దాని పాత్రను పరిచయం చేశారు. బాధిత వ్యక్తుల హక్కులను పరిరక్షించడం, నేరాల విచారణను సమర్థవంతంగా నిర్వహించడానికి కొత్త క్రిమినల్‌ చట్టాలకు మెరుగులు దిద్దినట్లు తెలిపారు. దేశ నేర న్యాయ వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు జులై 1 నుంచి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపిసి 1860), క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సిఆర్‌పిసి) 1973, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ 1872లను కొత్త అంశాలతో రూపొందించి అమలు చేయనున్నట్లు తెలిపారు.

➡️