తామరపల్లిలో తాగునీటి కష్టాలు

Feb 12,2024 22:23
తామరపల్లిలో తాగునీటి కష్టాలు

ప్రజాశక్తి-రామచంద్రపురంఅసలే రానున్నది వేసవికాలం తాగునీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో తమ గ్రామానికి మంచినీళ్లు సక్రమంగా అందకపోవడంతో కె.గంగవరం మండలం తామరపల్లి గ్రామస్తులు తాగునీటి కోసం కటకటలాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామరపల్లి గ్రామంలో 1500 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో 2001లో నిర్మించిన మంచినీటి ట్యాంకు శిథిలం కావడంతో నీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో కుందూరు కేంద్రంగా ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు ఒక మంచినీటి పథకానికి రూపకల్పన చేశారు. కుందూరు నుంచి గంగవరం, తామరపల్లి, కొత్తకోట, సుందరపల్లి, ఊడుమూడి గ్రామాలకు మంచినీటి సరఫరా కోసం ట్యాంకులను నిర్మించారు. దీనిలో భాగంగా తామరపల్లి గ్రామానికి 40 వేల లీటర్ల కెపాసిటీతో ట్యాంక్‌ నిర్మించారు. 2011లో నిర్మించిన ట్యాంకు అప్పటి జనాభా వెయ్యి మంది కావడంతో మంచినీరు సరిపోయేది. ప్రస్తుతం గ్రామ జనాభా 1500కు పెరిగింది. దీంతో ఆ నీటి ట్యాంకు సరఫరా గ్రామస్తులకు అందకపోవడంతో మంచినీటి సమస్య ఉత్పన్నమైంది. దీనికి తోడు కుందూరు ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ నుంచి వచ్చే మంచినీరు ఉదయం అరగంట మాత్రమే రావడంతో మిగిలిన రోజంతా గ్రామస్తులు మంచినీటి కోసం అల్లాడుతున్నారు. చాలీచాలని పైపులైన్లతో కేవలం అరగంట మాత్రమే నీళ్లు ఇవ్వడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఉన్న ప్రాంతాలకు ఇంకా వాటర్‌ టాప్‌ కూడా వేయకపోవడంతో గ్రామస్తులు మంచినీటి కోసం పలు వాటర్‌ ప్లాంట్లకు మంచినీరు కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు. గ్రామస్తులకు ఉదయం సాయంత్రం మంచినీటిని సరఫరా చేయాలని ధికారులకు గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇపుడే ఇలా ఉంటే వచ్చే వేసవిలో పరిస్థితి ఏమిటని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

➡️