సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష

Feb 26,2024 22:47
సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష

ప్రజాశక్తి-అమలాపురంత్వరలో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇవిఎంలు స్ట్రాంగ్‌ రూములలో భద్రపరుచుట, అనంతరం లెక్కింపు కేంద్రాల ఏర్పాటుకు సిద్ధం చేసినట్టు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం ఆయన మాట్లాడారు. ఓటర్‌ జాబితా సంక్షిప్త సవరణలో పురోగతిని వివరించారు. కౌంటింగ్‌ లెక్కింపు కేంద్రాలకు అనువైన భవనంగా కాట్రేనికోనలోని శ్రీనివాస ఇంజనీరింగ్‌ కళాశాలను ఎంపిక చేశామని, దీనికంటే మెరుగైన వసతులు గల భవనాలు ఉంటే రాజకీయ పార్టీలు తమ దృష్టికి తేవాలని కోరారు. పోలింగ్‌ పూర్తయిన పిదప జిల్లావ్యాప్తంగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలన్నింటినీ శ్రీనివాస ఇంజినీరింగ్‌ కళాశాలలో భద్రపరిచి వాటి పక్కనే లెక్కింపు హాలు సిద్ధం చేసినట్టు చెప్పారు. కళాశాల కింది భాగంలో కాక మొదటి రెండు అంతస్తుల్లో స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరుస్తామని చెప్పారు. కళాశాల ప్రధాన గేటు వద్ద కేంద్ర బలగాలు, రాష్ట్ర సెక్యూరిటీ బృందాలు స్ట్రాంగ్‌ రూములకు భద్రతను ఓట్ల లెక్కింపు వరకూ కల్పిస్తాయన్నారు. కళాశాలలో 10 లేదా 12 టేబుల్స్‌ ఏర్పాటుకు హాలులు లెక్కింపునకు స్ట్రాంగ్‌ రూములో పక్కనే అనువుగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఫారం-7 ఓట్ల తొలగింపునకు సంబంధించి మరణ ధ్రువపత్రం ఉంటేనే ఓట్లను తొలగిస్తున్నామని చెప్పారు. ఓటర్‌ జాబితాలో ఫోటోలు సక్రమంగా లేని మరణించిన వారి ఓట్లు జాబితాలో ఉన్నాయని ఇటీవల వివిధ దినపత్రికలలో వస్తున్న ప్రతికూల వార్తలపై ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టి సరిదిద్దుతున్నట్టు చెప్పారు. ఓటర్‌ జాబితాలో ఓటర్లను ఒక పోలింగ్‌ కేంద్రం నుంచి మరో పోలింగ్‌ కేంద్రానికి మార్పుకు సంబంధించి నోటీసులు ఇస్తూ ఒకచోట మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పోలింగ్‌ కేంద్రాల్లో కనీస వసతులు ఉన్నదీ లేనిదీ పరిశీలన చేయవచ్చునని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల్లో కనీస వసతులైన వికలాంగులకు తాగునీరు, రన్నింగ్‌ వాటర్‌తో మరుగుదొడ్డి, లేదా తాత్కాలిక మరుగుదొడ్డి, నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా ఫర్నిచర్‌ వంటి సదుపాయాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లు, భారతీయ జనతా పార్టీ తరఫున దూరి రాజేష్‌, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ తరపున వడ్డీ నాగేశ్వరరావు బహుజన సమాజ్‌ పార్టీ తరఫున కాశీ లక్ష్మీ భవాని ఆమ్‌ ఆద్మీ పార్టీ తరపున పి పవన సూర్య ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️