పెట్రోల్‌ లూజు విక్రయాలు, క్రాకర్స్‌ నిషేధం

May 22,2024 21:48
పెట్రోల్‌ లూజు విక్రయాలు, క్రాకర్స్‌ నిషేధం

ప్రజాశక్తి-అమలాపురం పోలింగ్‌ అనంతరం పలుచోట్ల చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో జిల్లాలో లూజ్‌ పెట్రోల్‌ అమ్మకాలు, మందు గుండు సామాగ్రి క్రాకర్స్‌ తయారీ అమ్మకాలపై ఎన్నికల కౌంటింగ్‌ వరకూ నిషేధాన్ని పట్టిష్టంగా అమలు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో క్రాకర్స్‌ వ్యాపారులు, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులతో ఆమె బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జిల్లా యంత్రాంగానికి ప్రజా శ్రేయస్సు, రక్షణ దృష్ట్యా పరస్పర సహకారం అందించాలని సూచించారు. జూన్‌ 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు సందర్భంగా కోనసీమ జిల్లావ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఈ 15 రోజులు పాటు క్రాకర్స్‌ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా శ్రేయస్సు దష్ట్యా వాయిదా వేసుకుని పరస్పర సహకారం అందించాలని ఆమె స్పష్టం చేశారు. జిల్లా అడ్మిన్‌ ఎస్‌పి ఎస్‌ ఖాదర్‌ బాషా మాట్లాడుతూ ప్రస్తుతం గోదాముల్లో నిల్వ ఉన్న క్రాకర్స్‌ను నమోదు చేసి సీలు వేయించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. దీపావళి బాణాసంచా విక్రయాల్లో ప్రభుత్వం క్రాకర్స్‌కు ఆన్ని విధాలుగా రక్షణ కల్పిస్తోందని ప్రస్తుత హింసాత్మక సంఘటనల నేపథ్యంలో అధికారులకు క్రాకర్స్‌ పూర్తిగా శాంతియుత వాతావరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించేందుకు పూర్తిగా తోడ్పాటు అందించాలని సూచించారు. ఈ 15 రోజులలో క్రాకర్స్‌ మూలంగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో దానికి సంబదించిన పరిశోధనలో క్రాకర్‌ అమ్మినట్లు రుజువైన ట్లయితే పలు కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉందని పర్మిషన్‌ రద్దు చేయడం గోదాములు సీజ్‌ చేయడం వంటి చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు. అగ్నిమాపక విపత్తుల స్పందన అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. పలువురు వర్తకులు తమ మందు గుండు సామాగ్రి విక్రయాలను జూన్‌ 10 వరకు వాయిదా వేసుకుంటున్నట్లు అంగీకారం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, డిఎస్‌పిలు, పాల్గొన్నారు.

➡️