చలి వేంద్రాలను ఏర్పాటు చేయాలి

Apr 21,2024 22:15

ఏరియా ఆసుపత్రి వద్ద చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ కుటుంబ సభ్యులు

ప్రజాశక్తి-అమలాపురం

వేసవిలో ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు మరియు ఇతర పనుల నిమిత్తం వచ్చే ప్రయాణికుల దాహార్తిని తీర్చడంలో దాతలు ముందుకు వచ్చి మరిన్ని చలి వేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆకాంక్షించారు ఆదివారం స్థానిక ప్రాంతీయ ఆ సుపత్రి వద్ద జిల్లా కలెక్టర్‌ వారి సౌజన్యంతో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అనంతరం బాటచారులకు ఆసుపత్రికి వైద్య సేవల నిమిత్తం వచ్చేవారికి మజ్జిగను, కూల్‌ డ్రింక్స్‌ ఉచితంగా జిల్లా కలెక్టర్‌ వారి తండ్రి ఎంఎల్‌ శుక్లా, తనయుడు రియెన్షు శుక్లా లు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వేసవి మండు టెండలు నేపథ్యంలో దాతలకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆలోచన రావడం గొప్ప విషయమన్నారు. ఎండకాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన పలువురు దాతలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున చిన్నారులు, వద్ధులు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచనల మేరకు మరి అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితులలోనూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు బయట సంచరించ వద్దని సూచించారు. చలివేంద్రం అనేది ప్రజల దాహార్తిని తీర్చేందుకు దాతల సహాయంతో ఏర్పాటు చేయబడిన ఉచిత మంచి నీటి కేంద్రమని. కొత్త కుండలలో మంచినీటిని నింపడం వలన ఈ నీరు చల్లగా ఉంటుందని. వీటిని ఎక్కువగా రద్దీగా ఉండే ప్రధాన రోడ్ల కూడలి ప్రదేశాల్లో ఏర్పాటు చేయా లని సూచించారు. ప్రజలకు ఎక్కువ గా దాహం వేసే వేసవి కాలంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం మన పూర్వీకుల నాటి నుండి ఆనవాయితీగా వస్తోందన్నారు వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రికి వచ్చే రోగులు వారి బంధువుల దాహార్తిని తీర్చడంలో ఈ చలివేంద్రం కీలకం కానున్నదన్నారు. వివిధ పనుల నిమిత్తం వచ్చే ఇతర గ్రామస్తులకు, ముఖ్యంగా పేదవారికి ఈ చలివేంద్రాలు ఎంతో ఉపకరిస్తాయన్నారు. ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా స్వచ్ఛమైన తాగునీటిని అందించనున్నట్లు, అదేవిధంగా మజ్జిగను పంపిణీ చేస్తారని తెలి పారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్రావు వైద్యాధికారులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

➡️