ఓటు హక్కును వినియోగించుకోవాలి

Apr 3,2024 18:19

మడికి పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కొత్తపేట ఆర్‌డిఒ సత్యనారాయణ

ప్రజాశక్తి – ఆలమూరు

సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని కొత్తపేట ఆర్‌డిఒ జివివి.సత్యనారాయణ అన్నారు. మండలంలోని పోలింగ్‌ కేంద్రాలను బుధవారం ఆయన తహశీల్దార్‌ డివిఎన్‌.అనిల్‌ కుమార్‌, డిప్యూటీ తహశీల్దార్లు విజయ రేఖ, జానకి రాఘవలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో పోలింగ్‌ కేంద్రాల్లో వెలుతురు, గాలి పుష్కలంగా ఉండాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు తప్పకుండా అందుబాటులో ఉండాలన్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్థానిక అధికారులను ఆర్‌డిఒ ఆదేశించారు. మండలంలో గల 62 పోలింగ్‌ కేంద్రాల్లో ఆలమూరు, పినపళ్ళ, గుమ్మిలేరు, నర్సిపూడి, చొప్పెల్ల, చెముడులంక, మడికి, బడుగువానిలంక, మూలస్థాన అగ్రహారంలో గల 31 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని, వాటన్నిటిని పరిశీలించామని స్థానిక విలేకరులకు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఈ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎటువంటి అలజడులు కలుగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయునున్నట్లు ఆయన అన్నారు. కార్యక్రమంలో మండల సర్వేయర్‌ సందీప్‌ కుమార్‌, కార్యదరస్సులు సంజీవరెడ్డి, మోక్షంజలి, రేణుక, సత్యనారాయణ, రాజు, వీర్రాజు, విఆర్‌ఒ లు సూర్యప్రకాష్‌, జ్యోతి, రామకృష్ణ, రాంపండు, తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️