రైతుల ‘పంట’ పండింది

Apr 10,2024 13:33 #Konaseema

ఆశాజనకంగా దాళ్వా వరి చేలు
50 – 60 బస్తాల దిగుబడి అంచనా

ప్రజాశక్తి-రామచంద్రపురం : ప్రస్తుతం దాళ్వా వరి చేలు పంటలు పూర్తిగా పండి కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ముందుగా నాట్లు వేసిన రైతులు వరి కోతలు ప్రారంభించారు. సుమారు 5శాతం కోతలు ప్రారంభం కాగా మరో వారంలో పూర్తిస్థాయి వరి కోతలు ప్రారంభమవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. రామచంద్రపురం మండలంలో 17 వేల ఎకరాలలోను, కే గంగవరం మండలంలో 15 వేల ఎకరాల్లోనూ వరి పంట సాగు అవుతుంది. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడంతో పంటలు ఆశ జనకంగా ఉన్నాయి. ఇప్పటికే వరి కోతలు పూర్తయిన ఒకటి రెండు చోట్ల ధాన్యం 50 నుండి 60 బస్తాల మధ్యలో దిగుబడులు వచ్చాయని రైతులు తెలియజేస్తున్నారు. పంటలు బాగా పండడంతో రైతన్నల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మొదట్లో దాళ్వా వరి చేలకు సాగునీటి సమస్యల ఉత్పన్నం కాగా వాటిని ఇరిగేషన్ అధికారులు పరిష్కరించడంతో రైతన్నలు పంట కాలాన్ని పూర్తి చేశారు. దీంతో పాటు ఈ ఏడాది వరి చేలకు తెగుళ్లు బెడద అంతంతమాత్రంగానే ఉండడంతో పంటలు బాగా పండేందుకు ఉపయోగపడింది. మరో వారంలో కోతల ప్రారంభమై మే నెలాఖరు నాటికి పూర్తవుతాయని మండల వ్యవసాయ అధికారులు తెలిపారు. అయితే దాల్వా వరి చేలలో అధిక శాతం మంది రైతులు బోండాలు రకం పంట వేసుకున్నారు. తొలకరి మాదిరిగానే క్వింటాలకు రూ 283లు, అదే 70 కేజీలకురూ. 1637లు మద్దతు ధర కొనసాగుతుంది. రైతన్న కష్టపడి పండించిన పంటలకు కోతలు పూర్తయిన వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులకు సొమ్ములు సకాలంలో చెల్లించాలని రైతన్నలు కోరుతున్నారు.

➡️