మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Jan 31,2024 16:13 #Konaseema
mid day meals workers protest

ఎంఈఓలకు వినతి పత్రాలు
ప్రజాశక్తి-మండపేట : మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బుధవారం రామచంద్రపురం, కే గంగవరం, రాయవరం, ఉప్పలగుప్తం మండలాల్లో ఎంఈఓలకు యూనియన్ అధ్యక్షురాలు కే.సత్యవేణితో కలిసి మధ్యాహ్న భోజన కార్మికులు వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యoతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందని అయితే గత 23 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులతో ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ రూ.10 వేలు వేతనం, ప్రతి నెలా 5వ తేది లోపు వేతనాలు, బిల్లులు ఇవ్వాలని, గ్యాస్ ను ప్రభుత్వమే సరఫరా చెయ్యాలని, 12 నెలలకు వేతనాలు ఇవ్వాలని, మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు రూ. 20 రూపాయలలకు పెంచాలని, ప్రమాదబీమా సౌకర్యం కల్పించాలని, వంటచేసేటప్పుడు అగ్నిప్రమాదానికి గురైనటువంటివారికి నష్టపరిహారం చెల్లించాలని, స్కూల్స్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఏర్పాటు చేయాలని, ఇఎస్ఐ సౌకర్యం కల్పించాలని, పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదని, మౌలిక సదుపాయాలు మంచినీరు, వంటషెడ్, గ్యాస్టవ్ ప్రభుత్వమే కల్పించాలని, సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్ ఇవ్వాలని మట్టి ఖర్చులు (దహన సంస్కారాలకు) ఇవ్వాలని, మెటర్నిటీ బెనిఫిట్ కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు అందజేశామన్నారు.

➡️