ఉద్యోగుల సంక్షేమం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు : భూమన

Dec 28,2023 12:48 #ttd

ప్రజాశక్తి-తిరుమల : ఎన్ని విమర్శలు ఎదురైనా కార్మికులకు, ఉద్యోగులకు మేలు చేయడంలో వెనక్కు తగ్గే ప్రసక్తి లేదనిటీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాల పంపిణీ పండుగ కార్యక్రమం గురువారం ఉదయం తిరుపతి మహతి ఆడిటోరియంలో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ.. వేలాదిమంది ఉద్యోగులకు తన చేతుల మీదుగా ఇంటి స్థలాలు పంపిణీ చేయడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. తన జీవితంలో ఇది మహదానందం కలిగించిన రోజని ఆయన చెప్పారు. 17 సంవత్సరాల క్రితం తాను టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిని కలిసి ఉద్యోగుల ఇళ్ల స్థలాల విషయమై చర్చించినట్లు చెప్పారు. తన ఒత్తిడి వల్లే ఉద్యోగులకు ఇంటిస్థలాలు మంజూరు చేసినట్టు 2009లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇదే వేదిక మీద తెలియజేశారని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇప్పించే విషయం గురించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని తాను సంప్రదించినప్పుడు ఆయన ఉద్యోగులందరికీ ఉచితంగా ఇంటి స్థలాలు ఇద్దామని చెప్పారన్నారు. అయితే చట్ట ప్రకారం ఇందులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగానే నామమాత్రపు ధరతో ఉద్యోగులకు, రిటైర్డ్‌ ఉద్యోగులందరికీ కూడా ఇంటి పట్టాలు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. పాగాలి వద్ద 350 ఎకరాల భూమి టీటీడీకి ఇవ్వడంలో జిల్లా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి కృషి కూడా అభినందనీయమన్నారు.

ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేలా ఉత్తర్వులు ఇచ్చారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల కోసం 210 కోట్ల రూపాయలు ఉద్యోగుల తరఫున చెల్లించడం చారిత్రాత్మకమని ఆయన చెప్పారు. పాగాలి వద్ద 350 ఎకరాలు త్వరలోనే స్వాధీనం చేసుకుని జనవరి చివరి నాటికి టీటీడీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికీ ఇంటి స్థలం ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. వడమాలపేట దగ్గర ప్రస్తుతం ఉద్యోగులకు ఇస్తున్న ఇంటి స్థలం మార్కెట్‌ విలువ 40 లక్షల రూపాయలకు చేరుకుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం, ధర్మకర్తల మండలి ద్వారా ఎంత మేలు జరిగిందో ఉద్యోగులు గుర్తించాలన్నారు. అనంతరం సీనియర్‌ అధికారుల సంఘం తరఫున టీటీడీ పీఆర్వో డా. టి.రవి, పలువురు ఉద్యోగులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

➡️