కమ్యూనిస్టుల హయాంలోనే విజయవాడ అభివృద్ధి

Apr 21,2024 23:22
  • సిపిఎం ‘సెంట్రల్‌’ అభ్యర్థి సిహెచ్‌.బాబూరావు

ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌నగర్‌

విజయవాడ నగరంలో అభివృద్ధి జరిగింది అంటే అది కమ్యూనిస్టుల హయాంలోనేనని ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్‌.బాబూరావు అన్నారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం సింగ్‌నగర్‌లోని రాజీవ్‌నగర్‌, హుడా కాలనీలో ఇండియా ఆదివారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడ అభివద్ధి చెందాలంటే సిపిఎం అభ్యర్థిని గెలిపించాలన్నారు. సింగ్‌నగర్‌ దగ్గర నుండి రాజీవ్‌ నగర్‌ కండ్రిక వరకు కమ్యూనిస్టులు కార్పొరేటర్లుగా ఉన్న సమయంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చిన ఘనత కమ్యూనిస్టులదేనని చెప్పారు. నేడు నగరంలో పేదలు నివశించడానికి ఇళ్లు లేవని, అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని ఇవేమీ పాలకులకు పట్టడంలేదని విమర్శించారు. బిజెపి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న టిడిపి, వైసిపి, జనసేన పార్టీలను ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. బిజెపితో కలిసి చంద్రబాబునాయుడు, జగన్‌ తమ పరిపాలనలో విజయవాడను ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ఛార్జీలు, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యాసర సరుకులు పెరగడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎన్నికల్లో సామాన్యులకు అందుబాటులో ఉండే కమ్యూనిస్టులు, వామపక్షాలకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ సిటీ కార్యదర్శి బి రమణరావు, కే దుర్గారావు, నాయకులు కె.శ్రీదేవి, చింతల శీను, ఎస్‌కె పీరు, నాగేశ్వరరావు, రాంబాబు, సాంబిరెడ్డి, అమ్ములు, ఝాన్సీ, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️