మండలాభివృద్ధే లక్ష్యం

Jan 6,2024 20:05

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిపి గిరిజమ్మ

– ఎంపిపి గిరిజమ్మ
ప్రజాశక్తి – మంత్రాలయం
మండల అభివృద్ధే లక్ష్యంగా అధికారులు పని చేయాలని ఎంపిపి వై.గిరిజమ్మ తెలిపారు. శనివారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ మణిమంజరి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో మండలంలో వివిధ శాఖల ద్వారా జరిగిన అభివృద్ధి పనులను సంబంధిత అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఎంపిపి గిరిజమ్మ మాట్లాడారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నేతృత్వంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ నిర్వహించి సమస్యలను పరిష్కరించేందుకు సుమారు రూ.8 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఉపాధి హామీ చట్టం కింద రూ.30 లక్షలతో మంత్రాలయం, సూగూరు, సింగరాజన్నహళ్లి, చౌటుపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేలో 20 గ్రామాలకు గాను 11 గ్రామాల్లో పూర్తయినట్లు చెప్పారు. సమస్యలున్న రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. త్వరలోనే 200 కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. త్వరలో చేపట్టనున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ రెండో విడతను విజయవంతం చేసేందుకు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు అవగాహన కల్పించాలని కోరారు. గత సర్వసభ్య సమావేశంలో కల్లుదేవకుంట గ్రామ సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాగునీటి పైపులైన్‌ కావాలని కోరగా రూ.1.75 లక్షలతో పైపులైన్‌ వేసి నీటి సరఫరా చేయడంతో ఆ శాఖాధికారులు ఎంపిపికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు మైదానం నుంచి ప్రత్యేక పైపులైన్‌, ఎంపిడిఒ కార్యాలయం వరకు మరమ్మతులు చేయడం అభినందనీయమని కొనియాడారు. వి.తిమ్మాపురం, వగరూరు గ్రామాల్లోని పలు కాలనీల్లో తాగునీటి సౌకర్యం కోసం నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. వాటిని ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని గెలిపించాలని ప్రజా ప్రతినిధులను కోరారు. నూతన సంవత్సరం సందర్భంగా కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మండల వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ సి.విశ్వనాథ్‌ రెడ్డి, వైస్‌ ఎంపిపి పులికుక్క రాఘవేంద్ర, సర్పంచి తెల్లబండ్ల భీమయ్య, ఎంపిటిసి జి.వెంకటేష్‌, 52 బసాపురం సర్పంచి రాఘవరెడ్డి, చెట్నిహల్లి సర్పంచి బెస్త అంజినయ్య, ఎంపిటిసి రామాంజనేయులు పాల్గొన్నారు.

➡️