రైతు సంఘం క్యాలెండర్‌ ఆవిష్కరణ

Jan 10,2024 20:40

రైతు సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న రైతు సంఘం నాయకులు

ప్రజాశక్తి – ఆస్పరి
ఆస్పరి ఆర్‌బికెలో ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం క్యాలెండర్లను బుధవారం రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి హనుమంతు, మండల అధ్యక్ష, కార్యదర్శులు మధు రెడ్డి, రంగస్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గతేడాది మండలంలోని రైతులు కరువుతో నష్టపోయారని, ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించినప్పటికీ గ్రామాల్లో కరువు సహాయక చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. గ్రామాల్లో రైతులు పశుగ్రాసం లేక పశువులను సంతలకు తీసుకెళ్లి అమ్ముతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కరువుతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల పంట నష్టపరిహారం ఇచ్చి రైతులు ఆదుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, సంబంధిత అధికారులు రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపదికన సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఎంపిఇఒలు జ్యోతిర్మయి, అనిల్‌ నాయుడు, సిఐటియు మండల కార్యదర్శి బి.రామాంజనేయులు, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి రవి, డివైఎఫ్‌ఐ మండల నాయకులు మురళీ, నాగరాజు పాల్గొన్నారు.

➡️