ఎర్రజెండాకు మద్దతుగా కార్మిక, కర్షకులు

May 1,2024 23:50

వడ్డేశ్వరంలో మాట్లాడుతున్న వి.కృష్ణయ్య
ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్‌ :
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వా విధానాలను, ప్రధాని మోడీ నిర్ణయాలను దేశవ్యాప్తంగా కార్మిక, కర్షకులు వ్యతిరేకిస్తున్నారని, వారంతా ఎర్రజెండాకు మద్దతుగా నిలుస్తున్నారని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య అన్నారు. మేడేను బుధవారం తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేబీ భవన్‌ వద్ద రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతు, వ్యవసాయ కార్మిక, కౌలురైతు సంఘాల జెండాలను సీనియర్‌ నాయకులు వై.కేశవరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు ఆవిష్కరిం చారు. కృష్ణయ్య మాట్లాడుతూ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను నిర్వీర్యం చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర పన్నిందని, నల్ల చట్టాలను రైతులు పోరాటం ద్వారా తిప్పికొ ట్టారని చెప్పారు. రాష్ట్రంలో బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేన, తొత్తుగా వ్యవహరిస్తున్న వైసిపిలనూ వ్యతి రేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్మికులు పోరాడి సాధించకుండా 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడులుగా మార్చటం కార్మిక రంగాన్ని దెబ్బతీయటమేనని, ఈ విధానాలకు వ్యతిరేకంగా ఎర్రజెండా నిత్యం పోరాడుతోందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూని చేస్తున్న ఎన్‌డిఎ కూటమిని రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని, ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వి.శివనాగరాణి, అప్పలస్వామి, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

➡️