భూభక్షక చట్టాన్ని రద్దు చేయాలి : న్యాయవాదుల డిమాండ్‌

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ విధానం ద్వారా భూములు కబ్జా చేస్తే తర్వాత భూ యజమానులు కనీసం కోర్టులకు కూడా వెళ్లే అవకాశం లేకుండా చేయడానికే భూభక్షక యాక్ట్‌ జగన్‌ తీసుకొచ్చారని సీనియర్‌ లాయర్‌, టిడిపి రాష్ట్ర లీగల్‌ సెల్‌ అధికార ప్రతినిధి కప్పల సునీల్‌ కుమార్‌ విమర్శించారు. మండల కేంద్రంలో పలువురు లాయర్లతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో శుక్రవారం మాట్లాడారు. దేశం మొత్తం మీద ఏ రాష్ట్రం తీసుకురాని ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తీసుకోవచ్చారని ఆయన ప్రశ్నించారు. అయితే నెపాన్ని మాత్రం నీతిఅయోగ్‌ పై నెట్టాలని చూసిన వైకాపా నాయకుల దుశ్చర్యలను ప్రజలు గమనించారని ఆయన అన్నారు. న్యాయవాదులు ఆరు నెలల పాటు పోరాడినా, కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు చట్టాన్ని తిప్పి పంపినా సవరణలు చేయకుండా గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం ఏ మేరకు సమంజసం అని ఆయన విమర్శించారు. ఈ చట్టం అమల్లోకి రావడం వల్ల చిన్న,సన్నకారు రైతులతో పాటు చిన్నపాటి స్థలాలు ఉన్నవారు సైతం ఎన్నో ఇబ్బందులు పడతారన్నారు. తమ భూమిని అమ్ముకోవాలన్నా టిఆర్‌ఓ అనుమతి కావాలని, టిఆర్వో గా ఎవరినైనా నియమించేలా చట్టంలో పెట్టారని ఇది ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. దీనితో వైకాపా నాయకుల్ని టిఆర్వోలుగా నియమించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూమిని అమ్ముకోవాలని భూ యజమాని టిఆర్వో గా ఉన్న వ్యక్తికి దరఖాస్తు చేస్తే యజమాని నుంచి డబ్బులు లంచంగా డిమాండ్‌ చేస్తారన్నారు. న్యాయంతో పనిలేదని లంచాలకు కక్కుర్తి పడి భూ యజమానులను నానావస్థలు పెట్టే అవకాశం కనిపిస్తుందన్నారు. లంచం ఇవ్వకపోతే, ఆ భూమిని అమ్ముకోవడానికి టిఆర్వో అనుమతి ఇవ్వడని ఈ విధంగా అవినీతి మరింత ప్రబలుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తుల పత్రాలను తమ వద్ద ఉంచుకొని, ప్రజలకు జిరాక్స్‌ పత్రాలు ఇస్తానన్న వైసిపి ప్రభుత్వాన్ని గతంలో కానీ, భవిష్యత్తులో కానీ చూడమని ఆయన అన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఈ దేశ ప్రజలకు ఇచ్చిన హక్కులను కాలరాసేలా ఉన్న ఈ చట్టం గురించి ప్రజలంతా తెలుసుకొని అవగాహన పెంచుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అనుసూరి గోవిందు, కె.ధనరాజు, తదితరులు పాల్గొన్నారు.

➡️