ఆడపిల్లలను అన్ని రంగాల్లో ప్రోత్సహిద్దాం

Mar 28,2024 17:00 #Kurnool

ప్రజాశక్తి చిప్పగిరి(కర్నూలు) : నేటి సమాజంలో ఆడపిల్లలను తక్కువ చూపు చూడకుండా వారు ఎన్నుకున్న దారిలో వారిని ప్రోత్సహిద్దామని ఆలూరు సిడిపిఓ మద్దమ్మ చిప్పగిరి ఎంఈఓ సావిత్రమ్మ బాలికల తల్లిదండ్రులకు సూచించారు. గురువారం మండల కేంద్రమైన చిప్పగిరి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌ ప్రసూన ఆధ్వర్యంలో భేటీ బచావో బేటి పడావో కార్యక్రమం అంగన్వాడీ టీచర్లు, పలు పాఠశాలలకు చెందిన బాలికలు సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం బాలికలను అన్ని రంగాలలో ప్రోత్సహించడానికి ఎన్నో పథకాలను తీసుకువచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో బాల్య వివాహాలు అక్కడక్కడ జరుగుతుండడం చూస్తున్నామన్నారు. అలా జరగకుండా బాలికల తల్లిదండ్రులకు పూర్తి అవగాహన పెంచే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతి తల్లిదండ్రులు కూడా తమ ఇంటిలో తమ కొడుకుతో సమానంగా కూతుర్లను చూసుకొని చదువులో ఇద్దరికీ పోటీ ఉండేలా ఎవరు బాగా చదువుకుంటారు అనే దృక్పథంతో ముందుకు తీసుకెళ్లాలన్నారు. అప్పుడే బాలికలు కూడా అనుకున్న విద్యను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి విజయం సాధించి తీరుతారన్నారు. బాలికలు కూడా పరిస్థితులు బట్టి మనం ఎలా నడుచుకోవాలి అని ఆలోచన చేసి మంచి నిర్ణయంతో ముందుకెళ్ళినప్పుడే మీరు ఏదైతే అనుకున్నారో అది సాధ్యం చేసుకోవడానికి దోహదపడుతుందన్నారు. పాఠశాల ఉపాధ్యాయ బందం పాల్గొన్నారు.

➡️