లిఫ్టిచ్చి చైన్‌ దొంగిలించాడు

May 22,2024 20:00

ప్రజాశక్తి-విజయనగరం కోట : నగరంలో చైన్‌ స్నాచింగ్‌ కు పాల్పడిన నిందితుడిని 24గంటల్లోనే అరెస్టు చేసి, అతని నుంచి చోరీ చేసిన చైను, స్కూటీని రికవరీ చేసినట్లు వన్‌ టౌన్‌ సిఐ బి.వెంకటరావు బుధవారం తెలిపారు. నగరంలోని కొత్త అగ్రహారం ఆంజనేయ స్వామి గుడి వద్ద గాజులరేగ వెళ్లేందుకు అరబిందోలో పని చేస్తూ, గాజులరేగలో నివాసం ఉంటున్న కె.షణ్ముఖ వెంకటేష్‌ మంగళవారం ఆటో కోసం వేచి ఉండగా, ఒక వ్యక్తి స్కూటీ పై వచ్చి, తాను కూడా గాజులరేగ వైపు వెల్తున్నానని, లిఫ్ట్‌ ఇస్తామని చెప్పడంతో షణ్ముఖ వెంకటేష్‌ అతని స్కూటీ ఎక్కాడు. మార్గ మధ్యంలో మాటల్లో పెట్టి, అతని మెడలోని చైను దొంగిలించాడు. ఈ విషయాన్ని తరువాత గుర్తించిన షణ్ముఖ వెంకటేష్‌ వన్‌ టౌన్‌ పిఎస్‌లో ఫిర్యాదు చెయ్యగా, పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వన్‌ టౌన్‌ క్రైమ్‌ ఎసై తారకేశ్వరరావు, క్రైం హెచ్‌సి అచ్చిరాజు, ఇతర పోలీసు బృందం దర్యాప్తు ప్రారంభించి, చైన్‌ స్నాచింగ్‌ కు పాల్పడిన వారు పట్టణంలోని లంకాపట్నంకు చెందిన దనాన యేసుగా గుర్తించారు. బుధవారం ఎన్‌సిఎస్‌ థియేటర్‌ దగ్గరలో అరెస్టు చేసి, చోరీ చేసిన బంగారు చైను, ఉపయోగించిన స్కూటీని స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండుకు తరలిస్తున్నట్లుగా వన్‌ టౌన్‌ సిఐ బి.వెంకటరావు తెలిపారు.గుర్తు తెలియని వ్యక్తుల వాహనాలు ఎక్కే ముందు వారి వాహనాల నంబరును గుర్తు పెట్టుకోవడం చాలా అవసరమని, అనుమానం ఉంటే అటువంటి వ్యక్తుల వాహనం ఎక్కపోవడం ఉత్తమమని తెలిపారు.

➡️