నిధుల్లేకుండా మరుగుదొడ్ల మరమ్మతులెలా?

Jun 28,2024 21:10

మంత్రి ఆదేశాలు అమలు ప్రశ్నార్థకమే

నేడు మున్సిపల్‌ సమావేశానికి సంధ్యారాణి

ప్రజాశక్తి – సాలూరు : మున్సిపాలిటీలో నిరుపయోగంగా ఉన్న సామాజిక మరుగుదొడ్లను మరమ్మతులు చేసి వెంటనే వినియోగంలోకి తేవాలన్న రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖా మంత్రి సంధ్యారాణి ఆదేశాల అమలు ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. అసలు నిధుల్లేని పరిస్థితిలో ఉన్న మున్సిపాలిటీలో సామాజిక మరుగుదొడ్ల మరమ్మతు పనులు ఎలా చేయాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వాస్తవంగా పట్టణంలోని 28 సామాజిక మరుగుదొడ్లు గత కొంతకాలంగా నిరుపయోగంగా వున్నాయి. పట్టణంలోని మురికివాడలకు సమీపంలో సామాజిక మరుగుదొడ్లు నిర్మించారు. ఇవి పూర్తిగా మరమ్మతులకు గురి కావడంతో ప్రజలు వినియోగించే పరిస్థితి లేదు. దాదాపు అన్ని మరుగుదొడ్లకు తలుపులు చిధ్రమయ్యాయి. కొన్నింటికి నీటి సౌకర్యం లేదు. వీటన్నింటికీ మరమ్మతులు చేయడానికి అంచనాలు వేసి పనులు చేపట్టాలని మంత్రి సంధ్యారాణి కమిషనర్‌ ప్రసన్నవాణిని ఆదేశించారు. వారం రోజుల్లో పనులు ప్రారంభం కావాలని హుకుం జారీ చేశారు. కానీ మున్సిపాలిటీలో సాధారణ నిధిలో డబ్బులు లేవు. మున్సిపాలిటీలకు రెండు రకాల సాధారణ నిధులు వుంటాయి. 001 ఖాతాలో వున్న నిధులు మున్సిపల్‌ కార్యాలయంతో పాటు పారిశుధ్య, ఇంజనీరింగ్‌, తాగునీటి సరఫరా విభాగాల్లో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలకు మాత్రమే వినియోగించాలి. 001 ఖాతాలో ఆస్తిపన్ను ద్వారా వసూళ్లు జమవుతాయి. 002 ఖాతాలో నీటి పన్ను, వినోదపు పన్ను, ప్రకటనల పన్నులకు సంబంధించిన నిధులు జమవుతాయి. వీటిని పారిశుధ్యం, తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులకు వినియోగించాల్సి వుంది. అయితే 002 ఖాతాలో సుమారు రూ.రెండు లక్షల వరకు మాత్రమే వున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక మరుగుదొడ్ల మరమ్మతు పనులు ఎలా చేయగలమని అధికారులు గుసగుసలాడు కుంటున్నారు. పట్టణంలోని 28 చోట్ల ఉన్న సామాజిక మరుగుదొడ్ల మరమ్మతు పనులకు సుమారు రూ.20లక్షలు అవసరమని ఇంజనీరింగ్‌ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు కౌన్సిల్‌ ఆమోదం కోసం అజెండాలో పొందుపర్చారు. శనివారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ అధ్యక్షతన సాధారణ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రి సంధ్యారాణి కూడా హాజరుకానున్నారు.మంత్రి దృష్టి సారిస్తే మంత్రి సంధ్యారాణి పట్టణంలోని సామాజిక మరుగుదొడ్ల మరమ్మతు పనుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తే తప్ప పనులు జరిగే అవకాశం లేదు. జిల్లా కలెక్టర్‌ను అడిగో, ప్రభుత్వం నుంచో రూ.20లక్షల నిధులు తీసుకొస్తే త్వరితగతిన పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా సామాజిక మరుగుదొడ్లు మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది.టెండర్లు పిలిచినా జరగని పనులుపట్టణంలో వివిధ గ్రాంట్లకు సంబంధించిన నిధులతో పనులు చేపట్టడానికి గతంలో అనేకసార్లు టెండర్లు పిలిచారు. 14,15 ఆర్ధిక సంఘాలకు సంబంధించిన నిధులతో పనులు చేపట్టడానికి అనేకసార్లు టెండర్లు పిలిచారు. కానీ టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. కొన్ని పనులకు శంకుస్థాపన చేసినా ప్రారంభం కాలేదు. ఈ విధంగా మున్సిపాలిటీలో వివిధ గ్రాంట్లకు సంబంధించిన నిధులు సుమారు రూ.7కోట్ల వరకు మూలుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు సకాలంలో మంజూరు కావడం లేదనే అనుమానంతో కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక మరుగుదొడ్ల మరమ్మతు పనులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకొచ్చే అవకాశం లేదు. నిధుల్లేవని స్పష్టంగా తెలిసిన తర్వాత పనులు త్వరితగతిన ఎలా చేయగలమనే ప్రశ్న తలెత్తుతోంది.

➡️