ఓట్ల కోసం నోట్ల ఎర!

May 12,2024 23:55

ప్రజాశక్తి – చిలకలూరిపేట : ఎన్నికల్లో గెలవడానికి ప్రజాభిమానంపై ఆధారపడకుండా ధన ప్రభావాన్నే ప్రధాన పార్టీల అభ్యర్థులు నమ్ముకున్నారు. ఎన్ని అడ్డదారులైనా తొక్కి.. ఎంత డబ్బయినా పంచి గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మొన్నటి వరకూ ప్రచారం సందర్భంగా ఇచ్చిన డబ్బు, మద్యం ఒకెత్తయితే శని, ఆదివారాల్లో ఈ ప్రలోభాలు తారాస్థాయికి చేరాయి. గతంలో లేనంతగా ఓటర్లకు డబ్బుల ఎరవేస్తున్నారు.నియోజకవర్గంలో 2.25 లక్షలకుపైగా ఓటర్లున్నారు. వీరిలో చిలకలూరిపేట పట్టణంలో 85 వేల మంది ఉన్నారు. పట్టణాల్లో అయితే రూ.2వేలు, గ్రామాల్లో అయితే రూ.1500 చొప్పున రెండు పార్టీల వారూ పంచుతున్నారని తెలిసింది. ఓటరు స్లిప్‌ పేరుతో ఇళ్లకు వెళ్లి ఆ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లకు లెక్కగట్టి డబ్బులిచ్చి వస్తున్నారని సమాచారం. రాత్రివేళల్లోనే ఈ తతంగం ఎక్కువగా జరుగుతోంది. ఎన్నికల మొత్తంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు రూ.60-70 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నట్లు ప్రచారమవుతుండగా ఇందులో చివరి రెండ్రోజుల్లో ఖర్చే సగానికి పైగా ఉంటుందని అంచనా. మరోవైపు ఓటర్లందరికీ డబ్బు పంచాలని, పార్టీ విభేదాలు చూడొద్దని ప్రధాన నాయకులు చెబుతుండగా క్షేత్రస్థాయిలో వారు మాత్రం కొందరికి ఇవ్వడంలేదని, అదే వివాదాలకు దారితీస్తోందని తెలుస్తోంది. ఓ ప్రాంతంలో ఒక పార్టీకి చెందిన వారు ఓటర్లందరికీ డబ్బులివ్వగా మరో పార్టీవారు వచ్చి తమ పార్టీ అనుకూరులకే ఇచ్చి కొంతమందిని ప్రత్యర్థి పార్టీ అభిమానులుగా భావించి ఇవ్వలేదని తెలిసింది. దీంతో స్థానికులు వారితో వివాదం పెట్టుకున్నారని సమాచారం. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం ఈ డబ్బు పంపిణీ నియంత్రణపై దృష్టిపెట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. పట్టణంలో 80 వరకూ సిసి కెమెరాలు ఉండగా వీటిల్లో సగం వరకూ పని చేయడం లేదు. మిగతా పని చేస్తున్న సిసి కెమెరాలను పరిశీలించినా డబ్బు పంపిణీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందనే వ్యాఖ్యలు వస్తున్నాయి.డబ్బు పంచుతున్న ఇద్దరి పట్టివేతప్రజాశక్తి – కారంపూడి : ఓట్లకు డబ్బులు పంచుతుండగా ఇద్దర్ని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మండలంలోని వేపకంపల్లిలో ఆదివారం ఉదయం ఇద్దరు వచ్చి ఓటరు జాబితా ఆధారంగా డబ్బలు పంచుతుండగా స్థానికులు గమనించారు. వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారి వద్ద రూ.3,85,000 స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేశారు. అయితే వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

➡️