వాడివేడిగా మేజర్‌ పంచాయతీ సమావేశం

May 24,2024 20:47

ప్రజాశక్తి – కొత్తవలస: కొత్తవలస మేజర్‌ గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశం పంచాయతీ సర్పంచ్‌ మచ్చ ఎర్రయ్య రామస్వామి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి కన్నబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సమావేశం ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ఎటువంటి తీర్మానాలు లేకుండానే ఉన్న అంశాలపైనే నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ రామస్వామి మాట్లాడుతూ సభలో ఎటువంటి కొత్త అంశాల పైన చర్చించకూడదని గ్రామాల పరిధిలో ఉన్న తాగునీరు, పారిశుధ్యం విద్యుత్‌ పైనే చర్చించాలని కోరారు. ఈ సందర్భంగా ఒకటో వార్డు సభ్యులు కర్రీ సోమేశ్వరి మాట్లాడుతూ తాము నివాసం ఉండే ప్రాంతంలో పారిశుధ్యం లోపించిందని, పారిశుధ్య కార్మికులను వీధిలో తుడిచి పోగు పెట్టిన చెత్త తొలగించాలని కోరిన పారిశుధ్య కార్మికులు ఎదురు సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డు సభ్యులైన తమ పరిస్థితి అలా ఉంటే, ప్రజల పరిస్థితి ఏమి కావాలని ఆవేద వ్యక్తం చేశారు. ఐదవ వార్డు సభ్యులు అప్పికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ వార్డు పరిధిలో విశాఖ అరకు ప్రధాన రహదారిపై సుమారు 25 రోజుల నుంచి వీధి దీపాలు వెలగటం లేదని చెప్పినా కనీసం మరమ్మతులు చేపట్టలేదన్నారు. చింతలదిమ్మ ప్రాంతంలో వీధి కొళాయిలకు ట్యాప్‌లు బిగించే ప్రయత్నం కూడా చేయకపోవడంతో తాగునీరు రోడ్డు పాలు అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఇఒపిఆర్‌డి కర్రీ ధర్మారావు మేజర్‌ పంచాయతీ కార్యాలయంలో పనిచేసే బిల్‌ కలెక్టర్లను అభినందించారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అధిక మొత్తంలో ఇంటి పన్నులు వసూలు చేశారని, కానీ ఇంకా మొండిబకాయలు అలాగే ఉన్నాయని వారి చేత కూడా కట్టే ప్రయత్నం చేయించాలని సభ్యులకు తెలిపారు. కొంతమంది గృహ నిర్మాణదారులు ఇంటి పన్ను ఎగ్గొట్టేందుకు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నారని గృహ నిర్మాణాలకు అనుమతులు పొంది కమర్షియల్‌ వ్యాపారాలు చేపడుతున్నారని వాటిపై దృష్టి సారించాలని తెలిపారు. మండల కేంద్రంలో ప్లాస్టిక్‌ అధిక మొత్తంలో వాడుతున్నారని, ప్రత్యేక కార్యచరణ ప్రారంభించాలని ప్లాస్టిక్‌ నిర్మూలనకు కృషి చేయాలని తెలిపారు. షాపు యజమానులు డస్ట్‌ బిన్నులు ఏర్పాటు చేయని వారిపై కఠినంగా వ్యవహరించి అపరాదా రుషం విధించేటట్లు చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యాలయ సిబ్బంది, వార్డు సభ్యులు పాల్గొన్నారు.షాపుల అద్దే సకాలంలో చెల్లించాలికొత్తవలస మేజర్‌ పంచాయతీకి సంబంధించి 22 షాపుల అద్దెలు సకాలంలో చెల్లించి గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని సర్పంచ్‌ మచ్చ ఎర్రయ్య రామస్వామి కోరారు. పంచాయతీ షాపుల యజమానులతో గ్రామ పంచాయతీ భవనంలో పంచాయతీ ఇఒ కన్నబాబు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ రామస్వామి మాట్లాడుతూ ఇప్పటి వరకు పంచాయతీ షాపులు సంబంధించి 60 లక్షల రూపాయలు బకాయి ఉన్నాయని, వాటిని సకాలంలో చెల్లించి పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. నాలుగు నెలలుగా పంచాయతీ స్లీపర్స్‌ జీతాలు బకాయి పడ్డామని, వారికి జీతాలు చెల్లించాలని తెలిపారు. గత నాలుగు నెలల గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్‌, గ్రీన్‌ అంబాసిడర్‌ జీతాలు పెండింగ్‌లో ఉన్నందున ప్రతి ఒక్కరు త్వరితగతిన చెల్లించాలని లేనియెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో 22 షాపుల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️