జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి : పిఒ

Jan 12,2024 21:58

పార్వతీపురం: జీవవైవిద్యాన్ని కాపాడుకోవాలని అందుకుగాను ప్రభుత్వ శాఖలు, స్వచ్చంధ సంస్థలు, ప్రజలు సమన్వయంతో కృషి చేయాలని ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో రెయిన్‌ఫారెస్ట్‌ అలయన్స్‌ లీడ్‌ ఎగ్జిక్యూటింగ్‌ ఏజెన్సీ వారిచే సస్టైనబుల్‌ అగ్రికల్చర్‌ అండ్‌ బయోడైవర్సిటీ అక్రాస్‌ ల్యాండ్‌స్కేప్స్‌ ప్రాజెక్ట్‌పై అవగాహన సదస్సును నిర్వహించారు. సదస్సులో పిఒ మాట్లాడుతూ వాతావరణ మార్పులు, అడవులు ఆక్రమణ, వ్యవసాయక్షేత్రాల విస్తరణతో జీవవైవిద్యం దెబ్బతింటుందని తెలిపారు. దీన్ని కాపాడేలా సమీకృత వ్యవసాయ విధానాన్ని చేపట్టాలని, అందుకు ప్రజలను ప్రోత్సాహించాలన్నారు. సమీకృత వ్యవసాయ విధానంతో సామాజిక ఆర్థికాభివృద్ధి కూడా సాధించేలా ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ అనుబంధ శాఖలకు సూచించారు. ప్రభుత్వం, రైతు సాధికార సంస్థ, స్థానిక పౌర సమాజ సంస్థల భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రెయిన్‌ఫారెస్ట్‌ అలయన్స్‌ ఈ ప్రాజెక్ట్‌ కు లీడ్‌ ఎగ్జిక్యూటింగ్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని, యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌- ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అమలు చేసే ఏజెన్సీలను వారితో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాజెక్టును విజయవంతం చేయాలని తెలిపారు. ప్రాజెక్టు వివరాలను మండల, గ్రామ స్థాయికి తీసుకువెళ్లాలని అధికారులకు తెలిపారు. రెయిన్‌ఫారెస్ట్‌ అలయన్స్‌ సంస్థ కన్సల్టెంట్‌ కె.శ్రీధర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను పవర్‌ పాయింటు ప్రజెంటేషను ద్వారా వివరించారు. అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పుల కేంద్ర మంత్రిత్వ శాఖ 2022లో తిరిగి కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంలో భాగంగా గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఫెసిలిటీ (జీఈఎఫ్‌) ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్‌ ఎంపికైంది. – నేతృత్వంలోని ‘వ్యవసాయ వ్యవస్థలను మార్చడం మరియు స్థిరమైన ప్రకతి దృశ్యం నిర్వహణ, ప్రభుత్వ-ప్రైవేట్‌ ఫైనాన్స్‌ ద్వారా భారతదేశంలోని అధిక జీవవైవిధ్య ప్రాంతాల్లో స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడం ఇప్పటివరకు రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ప్రారంభమైందని, త్వరలో 16 జిల్లాల్లో చేపడతామన్నారు. కురుపాం మండలంలో ఉరిడి పంచాయుతీలో గల 13 గ్రామాల్లో ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నట్టు తెలిపారు. సుమారుగా 1570 హెక్టార్ల విస్తీర్ణంలో, కొండబారిడి మైక్రో ల్యాండ్‌స్కేప్‌ ఇంప్లిమెంటేషన్‌ కార్యక్రమం చేపడతామన్నారు. రెయిన్‌ ఫారెస్ట్‌ అలయన్స్‌ సంస్థ స్టేట్‌ టీం లీడరు పి.వినూత్న మాట్లాడుతూ ప్రోజెక్టు విజయవంతం చేసేందుకు, ప్రజలకు ఆర్థికంగా అధిక ఆదాయం చేకూర్చేందుకు వ్యవసాయ అనుబంధశాఖల ద్వారా ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్వైఎస్‌ఎస్‌ డిఎం పి.షణ్ముఖరాజు, జిల్లా ఉద్యాన అధికారి కె.ఎస్‌.వరప్రసాద్‌, మత్స్యశాఖ, వ్యవసాయశాఖ మరియు ఇతర అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️