పట్టునిలుపుకున్న సంధ్యారాణి

Feb 24,2024 21:34

సాలూరుటి: డిపిలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి, పొలిట్‌ బ్యూరో సభ్యులు సంధ్యారాణి తన పట్టు నిరూపించుకున్నారు. సామాన్య నాయకురాలి స్థాయి నుంచి పార్టీలో అత్యున్నత పొలిట్‌ బ్యూరో సభ్యురాలి స్థాయి వరకు ఆమె ఎదిగారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె ఎస్టీ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆమె కాంగ్రెస్‌ నుంచి టిడిపిలో చేరి అనూహ్యరీతిలో ఎమ్మెల్యే సీటు సాధించుకున్నారు. అప్పటి నుంచి పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి పొలిట్‌బ్యూరో సభ్యురాలు, ఎమ్మెల్సీ పదవులను అలంకరించారు. 2014, 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌ దేవ్‌ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నియోజకవర్గ ఇన్చార్జిగా సంధ్యారాణిని పార్టీ నియమించింది. అప్పటి నుంచి నియోజకవర్గ ఇన్చార్జి, పొలిట్‌ బ్యూరో సభ్యురాలు, అరుకు పార్లమెంటు పార్టీ అధ్యక్షురాలి హౌదాలో ఆమె పార్టీ కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ తనదైనశైలిలో ముందుకెళ్లారు. సంధ్యారాణికి ఉన్న సీనియారిటీని గుర్తించిన అధిస్థానం రానున్న ఎన్నికల్లో పోటీకి ఆమె పేరును ఖరారు చేసింది. దీంతో ఆమె అనుచరుల్లో ఆనందం అవధులు దాటిపోయింది. ఆమె నివాసంలో సందడి వాతావరణం నెలకొంది. టిడిపి నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.భంజ్‌దేవ్‌కు భంగపాటురానున్న ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా సంధ్యారాణిని మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌ వ్యతిరేకిస్తూ వచ్చారు. ప్రత్యామ్నాయంగా స్థానికేతర గిరిజన నాయకురాలు ఎం.తేజోవతిని తెరపైకి తీసుకొచ్చారు. తేజోవతి ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీలో చేరారు. భంజ్‌దేవ్‌ అనుచరుల ఆశీస్సులు, టిడిపి రాష్ట్ర స్థాయి నాయకుల అండదండలతో టికెట్‌ తనకే వస్తుందని ఆమె భావించారు. అయితే పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా సంధ్యారాణి సేవలకు గుర్తింపుగా ఆమె పేరునే ఖరారు చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ఆశీస్సులతో సంధ్యారాణి సీటు సాధించినట్లు తెలుస్తోంది. ఏమైనా పార్టీలో భంజ్‌దేవ్‌ గ్రూపు నాయకులకు తాజా పరిణామం మింగుడు పడడం లేదు. పార్టీ అధినాయకత్వం ఇంత తొందరగా ఎమ్మెల్యే అభ్యర్ధి పేరు ప్రకటిస్తుందని భంజ్‌దేవ్‌ గ్రూపు నాయకులు ఊహించలేదు. సీటు ఖరారు చేసే ముందు అధిష్టానం మరోసారి తమను సంప్రదిస్తుందనే అభిప్రాయంతో భంజ్‌ దేవ్‌ వున్నారు. ఇటీవల శంఖారావం కార్యక్రమంలో పాల్గొనేందుకు సాలూరు వచ్చిన లోకేష్‌ సభ ముగిసిన తర్వాత తన కారులో భంజ్‌దేవ్‌, సంధ్యారాణి బాడంగి వరకు తీసుకెళ్ళారు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సాలూరు నియోజకవర్గం టిడిపి అభ్యర్థిని గెలిపించాలని, ఇద్దరూ కలిసి పని చేయాలని కోరినట్లు తెలిసింది. అప్పుడు కూడా భంజ్‌దేవ్‌ తన మనసులోని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారనే వాదనలు వినిపించాయి.

➡️