పార్వతీపురంలో టిడిపి జెండా ఎగరేస్తాం : బోనెల

Feb 24,2024 21:35

పార్వతీపురంరూరల్‌ : ఈసారి పార్వతీపురం సీటును అత్యధిక మెజార్టీతో గెలుచుకుని టిడిపి జెండాను ఎగురవేస్తామని నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజయచంద్ర అన్నారు. శనివారం రాష్ట్ర పార్టీ కార్యాలయం పార్వతీపురం టిడిపి అభ్యర్థిగా ఆయన పేరును ఖరారు చేయడంతో పార్టీ కార్యాలయంలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. ఉదయం నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్న టిడిపి శ్రేణులు, కార్యకర్తలు విజయచంద్ర పేరును చంద్రబాబు ప్రకటించడంతో ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు అభిమానులు, కార్యాలయానికి చేరుకుని ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం మందుగుండు సామాన్ల మోతతో పార్టీ కార్యాలయం నుంచి పార్వతీపురం పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకం నిలబెట్టుకుని రాబోవు ఎన్నికల్లో పెద్ద ఎత్తున మెజార్టీ సాధించి చంద్రబాబుకు కానుకగా అందిస్తామని తెలిపారు. ఇప్పటికే వైసిపి పాలనతో విసిగిపోయిన ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని, ఈసారి టిడిపి ఎన్నడూచూడని మెజారిటీతో పార్వతీపురం సీటును కైవసం చేసుకోబోతుందన్నారు. పార్టీలోని సీనియర్లను, కార్యకర్తలను, అభిమానులను అందరినీ కలుపుకొని ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు ఆయన ప్రకటించారు.

➡️