పివిటిజి శతశాతం నమోదు లక్ష్యం : కలెక్టర్‌

Jan 13,2024 20:24

పాచిపెంట: పిఎంజన్‌మాన్‌లో పివిటిజి (పర్టిక్యూలరీ వెనిరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్‌) శత శాతం నమోదు లక్ష్యంగా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. పిఎం జన్‌ మాన్‌ (పిఎంజెఎం) ప్రధాన మంత్రి జన్‌ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌) కార్యక్రమం మండలంలోని పనుకువలసలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పివిటిజిలు అభివృద్ధికి దూరంగా ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం పిఎం జన్‌ మాన్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. మిషన్‌ మోడ్‌లో మహా అభియాన్‌ కార్యక్రమం చేపడుతూ ప్రతి పివిటిజికి ప్రతి పథకం అందాలని నిర్ణయించిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఉజ్జ్వలయోజన పథకం కింద నమోదు కావాలని, తద్వారా ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్‌ లభిస్తుందని తెలిపారు. ఏడాదికి 12 సిలిండర్లు 30 శాతం రాయితీపై లభిస్తుందన్నారు. జిల్లాలో గత కొద్ది రోజుల్లో 10 వేల మందికి మంజూరు చేశామని, 80 వేల మందికి ఇవ్వాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. జీవన్‌ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన వలన ప్రమాద బీమా లభిస్తుందని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పిఎం కిసాన్‌ కోసం నమోదు చేసుకోవాలని సూచించారు. ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం, ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన, దీనదయాళ్‌ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (గ్రామీణ), పిఎం ఉజ్వల యోజన, పిఎం విశ్వకర్మ, పిఎం కిసాన్‌ సమాన్‌, కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌, పిఎం పోషన్‌ అభియాన్‌, హర్‌ ఘర్‌ జల్‌ – జల్‌ జీవన్‌ మిషన్‌, జన్‌ధన్‌ యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన, పిఎం ప్రణామ్‌, నానో ఎరువులు, సికిల్‌ సెల్‌ అనీమియా ఎలిమినేషన్‌ మిషన్‌ వంటి గిరిజన ప్రాంతాలకు సంబంధించిన నిర్దిష్ట పథకాలు, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ తదితర అంశాలను అమలు చేస్తున్నారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి జన్‌జాతి ఆదివాసీ గ్రామంలో అవగాహన సదస్సులు పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆయన అన్నారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత మంచాల పారమ్మ మాట్లాడుతూ గిరిజనులకు ఐటిడిఎ ద్వారా గతంలో వలే రాయితీలు అందించాలని, గిరిజన సాంప్రదాయం కనుమరుగవుతున్న తరుణంలో గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు చిరస్మరణీయం గా ఉండేందుకు మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు. ఉజ్వల కార్యక్రమం కింద గ్యాస్‌ ఉచితంగా లభిస్తుందని ఆమె తెలిపారు. సర్పంచ్‌ సిహెచ్‌ సీతారామ కృష్ణ మాట్లాడుతూ 160 పోడు పట్టాలు అందించడం పట్ల అభినందించారు. స్మశాన వాటికలకు రహదారులు ఏర్పాటు చేయాలని, జాతీయ రహదారికి అనుసంధాన రహదారులు ఏర్పాటు చేయాలని కోరారు. గడబలను బోడో గదబలుగా గుర్తించాలని, జీడి పిక్కల పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరారు. పారమ్మ కొండకు ఇతర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తున్నారని, సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సమాచార పౌర సంబంధాల శాఖ పిఎం జన్‌ మాన్‌, పిఎంఏవై, 4జి మొబైల్‌, అభిలాష (గ్రంధాలయాలు), జల జీవన్‌ మిషన్‌, శిశు మరణాలు నియంత్రణ, ఇన్నోవేటివ్‌ హబ్‌ తదితర అంశాలపై చాయా చిత్ర ప్రదర్శన ఏర్పాట చేశారు. పలువురు మహిళలకు పౌష్ఠిక ఆహారం అందించారు. వివిధ శాఖల అధికారులు తమ శాఖలు అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఉజ్జ్వల యోజన పథకం కింద గ్యాస్‌ కనెక్షన్‌ మంజూరు పత్రాలు అందించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవింద రావు, డిఆర్‌ఒ కె.హేమలత, ఎంపిపి బడ్నాన ప్రమీల, వైస్‌ ఎంపిపి ఎం.నారాయణ, డిఎంహెచ్‌ఒ బి.జగన్నాథ రావు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారి ఎంవిఆర్‌ కృష్ణాజి, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్‌ పాల్‌, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి కె శ్రీనివాసరావు, గ్రామ, వార్డు సచివాలయాల సమన్వయ అధికారి వి.చిట్టి బాబు, జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్‌ శివప్రసాద్‌, జిసిసి డిఎం మేనేజర్‌ వి.మహేంద్ర కుమార్‌, టిపిఎంయు ఎపిడి వై.సత్యంనాయుడు, ఐటిడిఎ ఎపిఒ ఎం.మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️