మలేరియా నివారణకు చర్యలు

May 23,2024 21:17

ప్రజాశక్తి-పాచిపెంట : మలేరియా నియంత్రణ ధ్యేయంగా మొదటి విడత దోమల మందు పిచికారీ చేపడుతున్నట్లు జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) టి.జగన్‌ మోహనరావు తెలిపారు. మండలంలోని పి.కోనవలస, పనసలపాడు గ్రామాల్లో ఇంటింటికీ చేపట్టిన స్ప్రేయింగ్‌ కార్యక్రమాన్ని గురువారం ఆయన పరిశీలించారు. స్ప్రేయింగ్‌ నిర్వహిస్తున్న తీరు, స్ప్రే నిబంధనలను ఏ మేరకు పాటిస్తున్నారో తనిఖీ చేశారు. స్ప్రే పూర్తయిన ఇళ్లకు మార్కింగ్‌ తప్పనిసరని ఆదేశించారు. మార్కింగ్‌ వేసిన ఇళ్లల్లో స్ప్రే జరిగిన విధానాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏడు సబ్‌ యూనిట్ల పరిధిలో 401 మలేరియా ప్రభావిత గ్రామాల్లో మొదటి విడత స్ప్రేయింగ్‌ నిర్వహిస్తున్నామని వివరించారు. ఇందులో సాలూరు సబ్‌ యూనిట్‌ పరిధిలో 126 గ్రామాల్లో దోమల మందు పిచికారీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 15న ప్రారంభమైన స్ప్రేయింగ్‌ వచ్చే నెలాఖరు వరకు కొనసాగుతుందన్నారు. మలేరియా, డెంగీ ప్రబలకుండా దోమల వ్యాప్తిని అరికట్టేందుకు స్ప్రేయింగ్‌ చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం జిఎన్‌.పేట పిహెచ్‌సిని తనిఖీ చేశారు. ప్రతి రోజూ ఒపిలో జ్వర లక్షణాలున్న వారు ఏ మేరకు వస్తున్నారు, నిర్వహిస్తున్న పరీక్షలు, వారి నివేదికల వివరాలపై ఆరా తీశారు. రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎఎంఒ సూర్యనారాయణ, వైద్యాధికారి స్తుతి, సబ్‌ యూనిట్‌ అధికారి ఎం.ఈశ్వరరావు, వి.శివకుమార్‌, ఆదిలక్ష్మి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.వసతిగృహాల్లో పిచికారీసాలూరు : పట్టణంలో బంగారమ్మ కాలనీలో గిరిజన సంక్షేమ, బిసి సంక్షేమ వసతి గృహాల్లో దోమల మందు పిచికారీని జిల్లా మలేరియా అధికారి టి.జగన్‌మోహనరావు గురువారం పరిశీలించారు. దోమల మందు పిచికారీ చేస్తున్న తీరు, వినియోగించిన ఎసిఎం రసాయనం తనిఖీ చేశారు. రాబోయే సీజన్‌లో వసతి గృహ విద్యార్థులకు జ్వరాలు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా స్ప్రేయింగ్‌ దోహదపడుతుందన్నారు. హాస్టల్‌లో అన్ని గదులు, టాయిలెట్లకు స్ప్రేయింగ్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో డ్రైడే కార్యక్రమం పక్కాగా నిర్వహించాలన్నారు. వైద్య సిబ్బంది, మున్సిపల్‌, వార్డు సిబ్బంది సమన్వయంతో ప్రజలు డ్రైడే పాటించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మలేరియా, డెంగీ నియంత్రణకు సమిష్టి కృషి చేయాలన్నారు. దోమల లార్వా వృద్ధి చెందే ప్రదేశాలను గుర్తించి వెక్టార్‌ కంట్రోల్‌ హైజీన్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేసి, వార్డు సచివాలయ కార్యదర్శులు పరిష్కరించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ ఎ.ప్రియాంక, ఎఎంఒ సూర్యనారాయణ, సబ్‌ యూనిట్‌ అధికారి ఎం.ఈశ్వరరావు, సూపర్‌వైజర్‌ ఎవి.రత్నం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️