ఉదయం 5.30కే మాక్‌ పోల్‌

Apr 15,2024 22:15

ప్రజాశక్తి-చీపురుపల్లి, రాజాం: పోలింగ్‌ రోజున ఉదయం 5.30గంటలకే మాక్‌ పోల్‌ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. అప్పటికి ఏజెంట్లు రాకపోతే, 15 నిమిషాలు ఎదురు చూసి, వచ్చినా రాకున్నా 5.45కు మాక్‌ పోల్‌ ప్రారంభించాలని చెప్పారు. నిర్ణీత సమయానికి ఈ ప్రక్రియ ప్రారంభించాలని, దీనికోసం ఉదయం 5 గంటలకే పోలింగ్‌ బూత్‌ లో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియపై సంపూర్ణ అవగాహన కల్పించుకొని, ఒక్క తప్పు కూడా దొర్లకుండా ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ, ఈవిఎంలు, వివి ప్యాట్ల పనితీరుపై పిఒలు, ఎపిఒలకు రాజాం, చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రాల్లో రెండోవిడత శిక్షణను సోమవారం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ, ఇవిఎంల పనితీరు, పిఒలు, ఎపిఒల విధులు, బాధ్యతలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఎన్నికల కమిషన్‌ రూపొందించిన వీడియోను ప్రదర్శించడం ద్వారా పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పోలింగ్‌ రోజున, సంబంధిత పోలింగ్‌ బూత్‌లో పిఒల బాధ్యత అత్యంత కీలకమని చెప్పారు. రీ పోలింగ్‌ కు ఎక్కడా అవకాశం ఇవ్వకూడదని, (మిగతా..3లో)ఎట్టి పరిస్థితి లోనూ తప్పులు, పొరపాట్లు జరగకూడదని స్పష్టం చేశారు. మూడో విడత శిక్షణా కార్యక్రమాన్ని మే మొదటి వారంలో నిర్వహిస్తామన్నారు. మాక్‌ పోల్‌ పూర్తి అయిన వెంటనే, వివి ప్యాట్‌ లను ఖాళీ చేయాలని, ఇవిఎంలను రీసెట్‌ చేసిన తరువాతనే పోలింగ్‌ ను ప్రారంభించాలని చెప్పారు. నిర్ణీత సమయం ఉదయం 7 గంటలకే పోలింగ్‌ ప్రారంభించాలని, ఉదయం నుంచే వీలైనంత వరకు వేగంగా పోలింగ్‌ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. పీఓలు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను ఉన్నది ఉన్నట్లు ఖచ్చితంగా అమలుచేయాలని ఆదేశించారు. పోలింగ్‌ ఏజెంట్లుగా వాలంటీర్లు ఉండకూడదని స్పష్టం చేశారు. రాజీనామా చేసిన వాలంటీర్లు గురించి బిఎల్‌ఒలు, లేదా ఎంపిడిఒ ధ్రువీకరించిన తరువాత ఏజెంట్లుగా అనుమతించ వచ్చునని సూచించారు. ఏజెంట్లు తప్పనిసరిగా ఆ నియోజకవర్గానికి చెందిన ఓటర్‌ అయ్యిఉండాలని స్పష్టం చేశారు. సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా ఏజెంట్లుగా ఉండవచ్చునని తెలిపారు. కార్యక్రమాల్లో రాజాం ఆర్‌ఒ జోసెఫ్‌, ఆయా మండలాల ఎఆర్‌ఒలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

➡️