అభివృద్ధిపై యంత్రాంగ పర్యవేక్షణ తప్పనిసరి : ఎంపిపి తోరాటి లక్ష్మణరావు

May 6,2024 14:45 #development, #Konaseema, #MPP

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : జరుగుతున్న అభివృద్ధిపై ప్రభుత్వ అధికార యంత్రాంగం పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు అన్నారు. మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన ఎంపీడీవో ఏ.మేరీ రోజ్‌ ఆధ్వర్యంలో సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా వివిధ శాఖల అధికారులు వారి పరిధిలో ఉన్న జరుగుతున్న, జరగబోయే అభివృద్ధిపై వివరాలు తెలియజేశారు. ఇందులో ముఖ్యంగా జొన్నాడ, గుమ్మిలేరు ఆర్‌ అండ్‌ బి రహదారికి చేపట్టిన మరమ్మతులపై ప్రశ్నించగా ఆశాఖ ఏఈ అందుబాటులో లేకపోవడంతో అంశాన్ని వాయిదా వేశారు. అలాగే కడియం, ఎదురుమూడి రహదారి పైన చర్చించారు. ఆ రహదారులకు మరమ్మత్తులు పూర్తిచేసిన నెల రోజులకే యధా స్థితికి చేరుకుంటున్నాయని, శాశ్వత పనులు చేయటం లేదని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. నీటిపారుదల శాఖ ఏఈతో శివారు భూములకు సాగునీరు అందించడంలో వైఫల్యాన్ని అధిగమించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు ఉపాధిహామీ పథకం ద్వారా కాలువల్లో పూడికతీత, గుర్రపు డెక్క వంటివాటిని తొలగించాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్స్‌ నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే విద్యుత్‌ శాఖ అంతరాయాలని అధిగమించాలని ఏఈకి ఆదేశించారు. మిగిలిన విషయాలపై సాదాసీదాగా సమావేశం పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు తోరాటి సీతామహాలక్ష్మి, మండల పరిషత్తు ఏవో రామ స్వరూప్‌, ఈవోపిఆర్డీ రాజ్‌ కుమార్‌, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️