విశ్రాంతి ఉద్యోగి హత్య

May 12,2024 21:25

ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని చిన్న శిర్లాం గ్రామంలో శనివారం అర్ధరాత్రి దళిత కాలనీలో నివాసం ఉంటున్న టిడిపి నేత, విశ్రాంతి కోర్టు ఉద్యోగి ఉత్తరావిల్లి సంగం (65) దారుణ హత్యకు గురయ్యాడు. అర్థరాత్రి అతని కుటుంబ సభ్యులు నిద్రలో నుంచి లేచి చూసేసరికి మెడపై కత్తిపోట్లుతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. భయబ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు తక్షణమే రాజు కేర్‌ ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. ఎప్పటిలాగే శనివారం ఇంటి బయట వరండాలో సంగం పడుకున్నారు. గుర్తు తెలియని దుండగులు బైక్‌ పై వచ్చి కత్తితో గొంతు కోసి పరారయ్యారు. మృతుని భార్య నక్షత్రమ్మ ఫిర్యాదు మేరకు చీపురుపల్లి డిఎస్‌పి మహేంద్ర, రాజాం రూరల్‌ సిఐ శ్రీనివాసరావు క్లూస్‌ టీంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముందు రోజే హత్యకు గురికావడంతో రాజకీయ హత్యేనని కుటుంబ సభ్యులు, మృతుని మేనకోడలు మాజీ జెడ్‌పిటిసి మంతెన ఉషారాణి ఆరోపించారు. 2019లో మృతుడు సంఘం టిడిపిలో చురుకైన పాత్ర వహించి, పార్టీకి క్రియాశీలకంగా సేవలందించారు. తన మేనకోడలు మంతన ఉషారాణికి రాజకీయంగా చేదోడువాదోడుగా ఉంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అతన్ని గ్రామంలో రాజకీయంగా ఎదుర్కొనలేకే హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. హత్య చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. రాజాం ఏరియా ఆసుపత్రిలో మృతుని కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, రాజాం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కొండ్రు మురళి మోహన్‌ ఓదార్చారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. సంగంకు పంచనామా నిర్వహించి రాజాం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు.అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం: డిఎస్‌పిరిటైర్డ్‌ ఉద్యోగి ఉత్తరావల్లి సంగం అనుమానాస్పద మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. కేసును వేగవంతంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్‌ చేస్తాం.. ఇప్పటికే క్లూస్‌ టీమ్‌ను రంగంలోకి దింపాం.

➡️