అంకిరెడ్డి చెరువులో ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు

Jan 8,2024 21:21

చెరువులో మట్టి తవ్వకాలు చేపట్టిన దృశ్యం

అంకిరెడ్డి చెరువులో ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు
– రాత్రి వేళ టిప్పర్ల ద్వారా రవాణా
– చోద్యం చూస్తున్న అధికారులు
ప్రజాశక్తి – మహానంది
మహానంది మండలం గాజులపల్లె గ్రామ సమీపంలోని అంకిరెడ్డి చెరువులో అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలు చేపడుతున్నారు. అర్థరాత్రి సమయాల్లో పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా అతివేగంగా ఎర్రమట్టి అక్రమ రవాణా చేస్తున్నారు. ఎర్రమట్టి టిప్పర్ల ద్వారా రవాణా చేసేటప్పుడు ఏమైనా ప్రమాదం సంభవిస్తే దీనికి ఎవరు బాధ్యులని ప్రజలు భయాందోళనకు గురవు తున్నారు. అక్రమ ఎర్రమట్టి రవాణా దర్జాగా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఎర్రమట్టి ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తూ అక్రమంగా అమ్ముకుంటూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. వైసిపి నాయకులు సహజ వనరులను తరలించుకుపోతున్నా, చెరువులలో మట్టి ఖాళీ అవుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎర్రమట్టి తరలింపునకు అనుమతులు ఉన్నాయో లేదో అధికారులకే తెలియాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు. రెవెన్యూ, మైనింగ్‌, విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ అధికారులు స్పందించి అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.ఎర్రమట్టి అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటాం- జనార్ధన్‌ శెట్టి, తహశీల్దారు, మహానంది. మహానంది మండలం గాజులపల్లి గ్రామంలోని అంకిరెడ్డి చెరువులో ఎర్రమట్టి అక్రమ రవాణా గురించి సమాచారం తెలుసుకున్నాం. వెంటనే పోలీస్‌, మైనింగ్‌, రెవిన్యూ తదితర శాఖల అధికారులను అప్రమత్తం చేసి ఎర్రమట్టి అక్రమ రవాణా చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశాము. ఎన్‌ఒసి లేకుండా ఎర్రమట్టి తవ్వకాలు ఎవరైనా జరిపితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాలు సీజ్‌ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

➡️