అంగన్‌వాడీల సమ్మె ఉధృతం

Dec 23,2023 21:26

ఒంటి కాలిపై నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీలు

అంగన్‌వాడీల సమ్మె ఉధృతం
– నంద్యాలలో ఒంటి కాలిపై నిలబడి..
– రుద్రవరంలో భజన చేస్తూ నిరసన
– చాగలమర్రిలో దున్నపోతుకు వినతి
– 12వ రోజుకు కొనసాగిన అంగన్వాడీల సమ్మె
– లబ్ధిదారులకున్న కృతజ్ఞత… సిఎంకు లేకపోవడం సిగ్గుచేటు
– ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి నిర్మల
ప్రజాశక్తి – విలేకరులు
తమ సమస్యలను పరిష్కరించాలని నంద్యాల జిల్లాల వ్యాప్తంగా అంగన్‌ వాడీలు 12వ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నంద్యాలలో ఒంటికాలిపై నిలబడి నిరసన చేపట్టారు. బేతంచర్ల, ఆత్మకూరులో నిరసన దీక్ష, బండిఆత్మకూరు, జూపాడుబంగ్లాలో తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. చాగలమర్రిలో దున్నపోతుకు వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. పగిడ్యాలలో అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. రుద్రవరంలో భజన చేస్తూ నిరసన తెలిపారు. బేతంచెర్లలో లారీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సంఘీభావం తెలియజేశారు.నంద్యాల రూరల్‌ : లబ్ధిదారులకు ఉన్న కృతజ్ఞత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి లేకపోవడం దురదృష్టకరమని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి నిర్మల విమర్శించారు. అంగన్వాడీల నిరవధిక సమ్మె శనివారం 12 రోజుకు చేరింది. నంద్యాలలోని తహశీల్దార్‌ కార్యాలయం ముందు అంగన్‌వాడీలు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు కార్యదర్శి సునీత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ గత 12 రోజుల నుండి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సచివాలయ ఉద్యోగులను పెట్టి ప్రతి ఇంటింటికి సరుకులు ఇస్తున్నా లబ్ధిదారులు తీసుకోవడం లేదని, తిరస్కరిస్తున్నారని, ఈ విషయాలను ప్రభుత్వం గమనించి ఇప్పటికైనా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి చర్చలు జరపాలన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.మద్దులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అంగన్వాడీల సమ్మెపై స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ప్రత్యక్ష కార్యచరణకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్‌ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. పాణ్యం : పాణ్యంలోని ఎంపిడిఒ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు సమ్మెలో భాగంగా నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ యూనియన్‌ నాయకులు వెంకటమ్మ అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు నిర్మలమ్మ, సిఐటియు మండల కార్యదర్శి కె.భాస్కర్‌లు మాట్లాడారు. విద్యార్థి సంఘం నాయకులు ప్రతాప్‌, వెంకటమ్మ, స్వరూప, మరియమ్మ, ప్రభాతమ్మ, లలితమ్మ, అనసూయ, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు : అంగనవాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ కార్యదర్శి మంజుల, నాయకురాలు లక్ష్మిదేవి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.రాజశేఖర్‌, సిఐటియు పట్టణ కార్యదర్శి రామ్‌ నాయక్‌, ఉపాధ్యక్షులు రణధీర్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె 12రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకురాలు విజయలక్ష్మి, వెంకటలక్ష్మి, ప్రియాంక, రవణమ్మ, రైతు సంఘం నాయకులు సుధాకర్‌, సిఐటియు నాయకులు సురేంద్ర, మహమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల సమ్మెకు ప్రముఖ వైద్యులు డాక్టర్‌ నాగన్న మద్దతు తెలిjజేస్తూ దీక్షలో పాల్గొన్నారు. బనగానపల్లె : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చేస్తున్న నిరవధిక సమ్మె 12వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. సిఐటియు నాయకులు జివి.సుబ్బయ్య మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు కార్యదర్శి రోజా రమణి, సభ్యులు రమాదేవి, శశికళ, మల్లేశ్వరి, వరలక్ష్మి, మహేశ్వరి, రజియాబి, హేమలత ,సరోజ తదితరులు పాల్గొన్నారు. రుద్రవరం : మండల కేంద్రం రుద్రవరంలోని తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తల సమ్మె 12వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా అంగనవాడి కార్యకర్తలు మనోజ, బిబి, పద్మావతి ఆధ్వర్యంలో అంగన్వాడీలు భజన రూపంలో నిరసన తెలియజేశారు. అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. కొలిమిగుండ్ల : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు మొహానికి చేతులు అడ్డం పెట్టుకొని నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా నాయకులు పి దావీదు, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకురాలు పద్మావతి, లీలావతి, రామలక్ష్మి, త్రివేణి, రేణుక, అనిత, భాగ్యలక్ష్మి, ప్రభావతి, జ్యోతి, శ్రీలక్ష్మి, లక్ష్మీనరసమ్మ, మహాలక్ష్మి, అరుణ, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️