అప్రెంటీస్‌ విధానం దుర్మార్గం

Feb 12,2024 21:16

నంద్యాలలో జీవో ప్రతులను దహనం చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

అప్రెంటీస్‌ విధానం దుర్మార్గం
– యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో జీవో కాపీలు దహనం
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో అప్రెంటీస్‌ విధానాన్ని ప్రవేశ పెట్టడం దుర్మార్గమని, తక్షణమే రద్దు చేయాలని యుటిఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. అప్రెంటీస్‌ విధానాన్ని ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తూ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో సోమవారం నంద్యాల పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జీవో కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పివి ప్రసాద్‌, గౌరవాధ్యక్షుడు జాకీర్‌ హుస్సేన్‌ మాట్లాడారు. సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఉపాధ్యాయ రంగంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను కావాలని సృష్టిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ యువకులను మోసం చేసే విధంగా డిఎస్‌సిని ప్రకటించటం సిగ్గుచేటన్నారు. నేడు విడుదలైన డిఎస్‌సి నోటిఫికేషన్‌లో సుదీర్ఘకాలం అనేక పోరాటాలు చేసి రద్దు చేసుకున్న అప్రెంటీస్‌ విధానాన్ని తిరిగి పునరుద్ధరింపచేస్తూ ఉత్తర్వులు విడుదల చేయడం దుర్మార్గమని, ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ కొత్తగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శులు రాంమోహన్‌, రామకృష్ణుడు, అరవింద్‌, ఖాసీం, ప్రేమకాంత్‌, వెంకటేశ్వర్లు, బాలస్వామి, శేఖర్‌, శంకర్‌, రామకృష్ణా రెడ్డి, అబ్దుల్‌ కలాం తదితరులు పాల్గొన్నారు. డోన్‌ : డిఎస్సీ నోటిఫికేషన్‌లో అప్రెంటీస్‌ విధానం వద్దని యుటిఎఫ్‌ రాష్ట్ర ఆడిట్‌ కమిటీ సభ్యులు ఎం.వెంకట సుబ్బారెడ్డి, జిల్లా కార్యదర్శి బివై సుబ్బా రాయుడులు ఖండించారు. డోన్‌ గాంధీ సర్కిల్‌ దగ్గర యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో జీవో ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. మండల ప్రధాన కార్యదర్శి గోపాల్‌, సీనియర్‌ నాయకులు వెంకటరామిరెడ్డి, శ్రీనివాసులు, రహీం, రమేష్‌ నాయుడు, చంద్రమోహన్‌, శంషాద్‌ బేగం , షీబారాణి, మధు, చార్లెస్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️