అభ్యర్థుల ఖరారుతో టిడిపి శ్రేణుల సంబరాలు

Feb 24,2024 21:04

నంద్యాలలో ఎన్‌ఎండి ఫరూక్‌కు స్వీట్‌ తినిపిస్తున్న నాయకులు

అభ్యర్థుల ఖరారుతో టిడిపి శ్రేణుల సంబరాలు
ప్రజాశక్తి – విలేకరులు
నంద్యాల జిల్లాల్లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు టిడిపి, జనసేన పార్టీల అధిష్టానం ఉమ్మడిగా అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. నంద్యాల స్థానానికి ఎన్‌ఎండి ఫరూక్‌, బనగానపల్లె బిసి.జనార్ధన్‌ రెడ్డి, శ్రీశైలం బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి, డోన్‌ కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ, పాణ్యం గౌరు చరితారెడ్డిలకు టికెట్లు కేటాయించారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు బాణా సంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
నంద్యాల ఎమ్మెల్యేగా బహుమతిగా ఇస్తాం : ఎన్‌ఎండి ఫరూక్‌
నంద్యాల కలెక్టరేట్‌ : టిడిపి నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో నంద్యాల ఎమ్మెల్యేగా తప్పకుండా గెలిచి చంద్రబాబు నాయుడికి బహుమతిగా అందిస్తామని ఎన్‌ఎండి ఫరూక్‌ అన్నారు. శనివారం టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇరువురు రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి కూటమి నుండి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్‌ఎండి ఫరూక్‌ను ప్రకటించడంతో పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. నంద్యాలలోని పలు వార్డుల్లో, ముఖ్య కూడళ్లలో బాణసంచా కాల్చుతూ, స్వీట్లు పంచుతూ, బైక్‌ ర్యాలీలు చేపట్టి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎండి ఫరూక్‌ మాట్లాడుతూ టిడిపి అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నంద్యాలలో పార్టీ జెండాను రెపరెపలాడిస్తామన్నారు. నంద్యాలలో జరిగిన ప్రతి అభివృద్ధి టిడిపి హయాంలోనే జరిగిందని, ఈ సారి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు నాయుడికి బహుమతిగా అందిస్తామని తెలిపారు. గత 42 ఏళ్లుగా పార్టీకి తాను చేసిన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు. 20 ఏళ్ల తర్వాత నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తప్పకుండా టిడిపిని గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని, 20 ఏళ్ల శిల్పా కుటుంబ అరాచక పాలనను తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపాఉరు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు ఎన్‌ఎండి ఫరూక్‌ను, వారి తనయుడు ఎన్‌ఎండి ఫిరోజ్‌ను ఆత్మీయంగా కలిసి వారికి హదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

బనగానపల్లె టిడిపి శ్రేణుల సంబరాలు

బనగానపల్లె : బనగానపల్లె టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి పేరును అధిష్టానం మొదటి జాబితాలో ప్రకటించడంతో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బనగానపల్లె కోటపై టిడిపి జెండాను ఎగరవేసి బిసి జనార్దన్‌ రెడ్డిని గెలిపించి పార్టీకి బహుమతిగా ఇస్తామని నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. బిసి జనార్దన్‌ రెడ్డి 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు .2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో బీసీ జనార్దన్‌ రెడ్డి ఓడిపోయినా కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. దీంతో 2024లో టిడిపి అభ్యర్థిగా అధిష్టానం బీసీ జనార్దన్‌ రెడ్డిని ప్రకటించింది.

ఆళ్లగడ్డ టపాసులు కాల్చిన భూమా అఖిలప్రియ అభిమానులు

ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డ టిడిపి అభ్యర్థిగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ఖరారు చేస్తూ అధిష్టానం ప్రకటించింది. ఆళ్లగడ్డ టికెట్‌పై కొన్ని రోజుల నుంచి నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. అఖిలప్రియ పేరును ఖరారు చేయడంతో ఆమె ఇంటి ఎదుట, సత్రం వీధిలో అభిమానులు టపాసులు కాల్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ హుస్సేన్‌ భాష, మాజీ జెడ్పిటిసి చాంద్‌ భాషా, నన్నేబై గారి జిలానీ, సగిలి శ్రీనివాస రెడ్డి, కోటపటి ప్రసాద్‌, సోముల లక్ష్మీనారాయణ రెడ్డి, సల్లే పల్లె వెంకటరామిరెడ్డి, నల్లగట్ల గుర్రప్పలు పాల్గొన్నారు.

చంద్రబాబు, లోకేష్‌ లకు కతజ్ఞతలు తెలిపిన అఖిలప్రియ : ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఖరారు చేసినందుకు మాజీ మంత్రి అఖిలప్రియ టిడిపి జాతీయ అధ్యక్షులు, చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆళ్లగడ్డలో టిడిపి విజయ కేతనం ఎగురవేస్తామన్నారు. నియోజకవర్గంలో టిడిపి విజయం ఖాయమని ఆమె స్పష్టం చేశారు.

➡️