నల్లమలలో వన్యప్రాణి వేటగాళ్లు అరెస్ట్‌

Dec 19,2023 20:52

వన్యప్రాణుల వేటగాళ్ల వివరాలు వెల్లడిస్తున్న రేంజర్‌ నాసిర్‌జా

నల్లమలలో వన్యప్రాణి వేటగాళ్లు అరెస్ట్‌
– నాలుగు నాటు తుపాకులు, మందు గుండు సామగ్రి స్వాధీనం
ప్రజాశక్తి – బండి ఆత్మకూర్‌
గుండ్లబ్రహ్మేశ్వరం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోని నల్లమల అడవిలో ఐదుగురు వన్యప్రాణి వేటగాళ్లను అరెస్టు చేసినట్లు బండి ఆత్మకూరు రేంజర్‌ నాసిర్‌జా తెలిపారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశవంలో ఆయన మాట్లాడారు. ఎన్‌ఆర్‌ కుంట, బాలయ్య కుంట పరిసరాల్లో సోమవారం వన్యప్రాణుల వేటగాళ్లు సంచరిస్తున్నారని సమాచారం మేరకు జిల్లా అటవీ అధికారి వినీత్‌ కుమార్‌ ఆదేశాల మేరకు రేంజర్‌ నాసిర్‌జా, మొబైల్‌ పార్టీ డిఆర్‌ఒ నాగేంద్ర నాయక్‌ ఆధ్వర్యంలో సిబ్బంది మెరుపు దాడులు చేసి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మాచకొండ నాగరాజు అలియాస్‌ ఎరుకల చిన్న, బండ్లపల్లె చిరంజీవి అలియాస్‌ మున్నా, ఫకీర్‌ హుస్సేన్‌ ఆలం అలియాస్‌ సలాం, పటాన్‌ పెద్ద మౌలాలి, షేక్‌ హుస్సేన్‌ వల్లి అలియాస్‌ బోదకాలు హుస్సేన్‌లను అరెస్టు చేసి, వారి వద్ద నుండి నాలుగు నాటు తుపాకులు, మందు గుండు సామగ్రి, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముద్దాయిలను కోర్టులో హాజరు పరుస్తామన్నారు. వన్యప్రాణులను వేటాడినా, వాటికి నష్టం కలిగించిన కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా అనుమతి లేకుండా అడవుల్లోకి ప్రవేశించినా చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నాటు తుపాకులు ఉన్న వారు స్వచ్ఛందంగా అప్పగించాలి : నల్లమల అడవి సమీప గ్రామాలైన కడమల కాలువ, సింగవరం, ఈర్ణపాడు, సోమయాజులపల్లి, జిసి పాలెం, జి.లింగాపురం, నారాయణపురం, చిన్నదేవలాపురం గ్రామాల్లోని ప్రజలతో పాటు నారపరెడ్డి కుంట, నెమ్మళ్లకుంట, మాయని చెరువు గూడెంలలో ఎవరైనా నాటు తుపాకులు కలిగి ఉంటే వారు స్వచ్ఛందంగా అటవీ శాఖ అధికారులకు అప్పగించాలని రేంజర్‌ నాసిర్‌జా తెలిపారు. అడవిలో వణ్యప్రాణులను వేటాడే వేటగాళ్లతోపాటు ఉచ్చులు వేసే వారు, అటవీ సంపదను అక్రమ రవాణా చేసేవారు, జంతువులకు హాని కలిగించే వారి సమాచారం తమ శాఖకు ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని, వారికి తగిన రివార్డులు అందజేస్తామని తెలిపారు. పర్యావరణ సంరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఫారెస్ట్‌ శాఖ సిబ్బంది సమన్వయంతో పని చేసి అడవిని సంరక్షించాలని సూచించారు.

➡️