నాడు అక్కచెల్లెమ్మలన్నాడు.. నేడు పట్టించుకోవడం లేదు..

Jan 16,2024 17:50

నంద్యాలలో పతంగులను ఎగురవేస్తూ నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు

నాడు అక్కచెల్లెమ్మలన్నాడు.. నేడు పట్టించుకోవడం లేదు..
– పండగ పూటా పస్తులు పెట్టిన సిఎం
– చర్చల పేరుతో కాలయాపన తగదు
– 36వ రోజూ అంగన్‌వాడీల నిరవధిక సమ్మె
– పతంగులు ఎగరేస్తూ, మట్టి, పచ్చి గడ్డి తింటూ, కళ్లకు గంతలతో నిరసన
ప్రజాశక్తి – విలేకరులు
     ‘ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అంగన్వాడీల పట్ల కక్షపూరితంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మహిళలను, అంగన్వాడీలను నాడు పాదయాత్రలో అక్కాచెల్లెళ్లలని చెప్పారు.. నేడు ఆ అక్కచెల్లెమ్మల బాధలను పట్టించుకోవడం లేదు. సంక్రాంతి పండగ రోజు కూడా మహిళలను రోడ్ల పైన కూర్చో పెట్టారు… కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరితే సిఎం మంత్రులను, సలహాదారుల ద్వారా చర్చలు జరుపుతూ కాలయాపన చేస్తున్నారు. తక్షణమే మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి’ అని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు డిమాండ్‌ చేశారు. నంద్యాల జిల్లాలో అంగన్‌వాడీల సమ్మె 36వ రోజు మంగళవారం కొనసాగింది. నంద్యాల జిల్లా కేంద్రంలో గాలిపటాలు ఎగరేస్తూ, ఆత్మకూరులో కళ్లకు గంతలు కట్టుకుని, బండి ఆత్మకూరులో పచ్చిగడ్డి తింటూ, బేతంచెర్లలో విస్తరాకుల్లో మట్టి తింటూ ప్రభుత్వంపై నిరసన తెలిపారు.
నంద్యాల కలెక్టరేట్‌ : అంగన్వాడీల పట్ల కక్ష సాధింపు ధోరణి ప్రదర్శించకుండా కనీస వేతనం పెంచాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, పట్టణ అధ్యక్షులు డి.లక్ష్మణ్‌, కెఎండి గౌస్‌, అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్మల, జిల్లా సహాయ కార్యదర్శి నాగరాణి, ప్రాజెక్టు కార్యదర్శి సునీతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల సమ్మె మంగళవారం 36వ రోజుకు చేరుకుంది. నంద్యాల జిల్లా కేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన శిబిరం నుండి పతంగులను ఎగురవేస్తూ, పతంగుల ద్వారా డిమాండ్లను ముఖ్యమంత్రికి లేఖల రూపంలో సమాచారం పంపిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేతనాలు పెంచలేమంటూ, జులైలో పెంచుతామని చెప్పడం చూస్తే అంగన్వాడీలను మభ్యపెట్టడమేనని అన్నారు. జులైలో జీతం పెంచుతామని చెప్పడం కాదు.. జులైలోనే పెంచుతామని జీవో రూపంలో ఇవ్వాలని, అప్పుడే సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నాన్నారు. అయితే దీనికి మాత్రం సమాధానం చెప్పకుండా పట్టీ పట్టనట్టు ఉంటున్నారని అన్నారు. కక్షపూరితంగా వ్యవహరిస్తే ఆ పర్యావసనం వేరే ఉంటుందని హెచ్చరించారు. సమ్మెకు జన విజ్ఞాన వేదిక కన్వీనర్‌ రామరాజు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. బేతంచర్ల : అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేయడం సరైనది కాదని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు జి.షేభారాణి అన్నారు. బేతంచర్లలో మండల నాయకురాలు గుల్జార్‌బీ ఆధ్వర్యంలో ఇస్తర్లలో మట్టిని వేసుకొని తింటూ అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పండగ రోజు ఆడపడుచులను రోడ్డుపై పెట్టి కుటుంబాలను పస్తులు పెట్టిన జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అంగన్వాడీలు నరసమ్మ, నారాయణమ్మ, రాధమ్మ, మద్దమ్మ, దస్తగిరమ్మ, మహేశ్వరి, సులోచన, రాజేశ్వరి, రామ తులసి, లక్ష్మీదేవి, మేరీ, అనూష, సంతోష, కళావతి, ఆదిలక్ష్మి, హసీనా, శ్రీదేవి, మధురవాణి, విజయమని, దేవమని పాల్గొన్నారు. ఆత్మకూరు : పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు 36వ రోజు సమ్మె చేపట్టి, కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏసురత్నం, పట్టణ కార్యదర్శి రామ్‌ నాయక్‌, ఉపాధ్యక్షులు రణధీర్‌, మండల కార్యదర్శి భాస్కర్‌, ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు కార్యదర్శి మంజుల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలు ప్రమీలమ్మ, లక్ష్మీదేవి, చెన్నమ్మ, సుజాత, భారతి, ఖాదర్‌ బి, నాగమణి, సిఐటియు నాయకులు సురేంద్ర, ఇస్మాయిల్‌, శివ కుమార్‌, వీరన్న, శ్రీధర్‌ పాల్గొన్నారు. మహానంది : మహానందిలోని తహశీల్దారు కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ దీక్షా శిబిరం ముందు ముగ్గులు వేసి నిరసన తెలిపారు. అంగన్వాడీలు చండీ దేవి, సావిత్రి, ఉషారాణి, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి : కొత్తపల్లి తహసిల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు సమ్మెలో భాగంగా ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకురాలు ఇ.హరిత, రమణమ్మ, శ్రీదేవి, అంగన్వాడీలు నాగమణి, వసంత, నాణెమ్మ, పద్మావతి, సరస్వతి పాల్గొన్నారు. బండి ఆత్మకూర్‌ : బండి ఆత్మకూరులో తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు పచ్చిగడ్డి తింటూ నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు మండల కార్యదర్శి రత్నమయ్య, నాయకులు రాజు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు వెంకటరమణ, ఆనందమ్మ, వసంత, శ్యామల మాట్లాడారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు. నందికొట్కూరు టౌన్‌ : నందికొట్కూరు పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ముందు అంగన్వాడీలు ప్లేట్లను గంటెలతో మోగిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు, సిఐటియు పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు మదార్‌బి, అంగన్వాడీ కార్యకర్తలు లక్ష్మి, సుజాత కీర్తి, రజియా తదితరులు పాల్గొన్నారు.

➡️