బాబు పాలనలో అన్నీ స్కామ్‌లే..

Jan 30,2024 21:01

ఇండోర్‌ స్టేడియాన్ని ప్రారంభిస్తున్న పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా

బాబు పాలనలో అన్నీ స్కామ్‌లే..
– రాబోయే రోజుల్లో చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం
– ఆళ్లగడ్డ ప్రాంతాన్ని గంగుల కుటుంబం ఎంతో అభివృద్ధి చేసింది
– రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా
– ఇండోర్‌ స్టేడియం ప్రారంభం
ప్రజాశక్తి – ఆళ్లగడ్డ
నాడు చంద్రబాబు పాలనలో స్కీమ్‌లు లేవని, అన్నీ స్కామ్‌లే ఉన్నాయని రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. చంద్రబాబు అనేక కేసుల్లో ఇరుక్కున్నారని రాబోయే రోజుల్లో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. మంగళవారం ఆళ్లగడ్డ పట్టణంలోని ఎద్దుల పాపమ్మ కళాశాల మైదానంలో నూతనంగా నిర్మించిన ఇండోర్‌ స్టేడియాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారులు గంగుల ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ఆర్కే రోజా, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి రోజా మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితోనే సాధ్యమన్నారు. ప్రజల్ని నిర్లక్ష్యం చేసి వారి మధ్యలో లేని ప్రజాప్రతినిధులను సిఎం పక్కన పెడుతున్నారని తెలిపారు. ఆళ్లగడ్డలో ఇండోర్‌ స్టేడియాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తనను ఆహ్వానించిన గంగుల కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతోనే ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న వారికి మరోసారి అవకాశం ఇస్తున్నారన్నారు. గంగుల కుటుంబం ఆళ్లగడ్డ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని, ఎమ్మెల్యే గంగుల నానిని మీరు ఆదరించాలన్నారు. ఎన్నికలు వస్తున్నాయని సంక్రాంతి పండుగకు డూడూ బసవన్నలు వచ్చినట్లు ప్రతిపక్షాల వారు వస్తున్నారని, వారికి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదని, వారిని తరిమికొట్టాలని ప్రజలకు సూచించారు. ఇప్పటిదాకా ముగ్గురు కృష్ణులు వచ్చారని, ప్రస్తుతం నాలుగో కృష్ణుడు వస్తున్నారన్నారు. 2014లో చంద్రబాబు గెలవడంతో రాష్ట్ర అభివృద్ధి కుంటు పడిందన్నారు. అనంతరం శాప్‌ చైర్మన్‌, రాష్ట్ర వైసిపి యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ తాను చాలామంది రాజకీయ నాయకులతో తిరిగానని, గంగుల కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. నాతో మాట్లాడేందుకు జిల్లా రాజకీయ నాయకులు భయపడతారని, మీ ఎమ్మెల్యే గంగుల నాని దగ్గర ఎంతో ప్రేమ దొరికిందన్నారు. ఇండోర్‌ స్టేడియం పూర్తి అయ్యేంత వరకు నిద్రలేని రాత్రులను నాకు ఆయన చూపించారన్నారు. పట్టుబట్టి ఇండోర్‌ స్టేడియాన్ని రెండు నెలల్లో పూర్తి చేశారన్నారు. మంచి మేనిఫెస్టోతో ముఖ్యమంత్రి జగన్‌ మరో పది రోజుల్లో మన ముందుకు వస్తారని, మంచి చేసిన వారికి ఓటు వేయాలన్నారు. గంగుల నానిని గెలిపించాలన్నారు. ఎమ్మెల్యే గంగుల నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే ప్రధాన లక్ష్యమన్నారు. చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో తాను డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశామని, ఇండోర్‌ స్టేడియాన్ని ఈరోజు ప్రారంభించుకున్నామన్నారు. ఫైనల్‌ మ్యాచ్‌ ఇండోర్‌ స్టేడియంలోనే జరుగుతుందన్నారు. రెండు నెలల్లో స్టేడియం పూర్తి అయ్యిందని, చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉండి కూడా స్థానిక టిడిపి నాయకులు స్టేడియాన్ని ఏర్పాటు చేయలేకపోయారని, కేవలం భూమి పూజకే పరిమితమయ్యారన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారులు గంగుల ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నెల వ్యవధిలోనే రూ. 29 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. నియోజకవర్గంలో మంచి జరిగిందంటేనే ఓటు వేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో బ్రిజేంద్రారెడ్డిని తిరిగి ఆశీర్వదించి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్‌ బాబులాల్‌, ఉమ్మడి జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ నాయక్‌ దిల్షాద్‌ ముజఫర్‌ హుస్సేన్‌, రాష్ట్ర మైనార్టీ ప్రభుత్వ సలహాదారుడు హబీబుల్లా, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ గంధం రాఘవరెడ్డి, జడ్పిటిసి రాచంరెడ్డి లక్ష్మీదేవి, రాచంరెడ్డి రామ్మోహన్‌ రెడ్డి, ఆర్డిఓ శ్రీనివాసులు, మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌ బాబు, ఎంపిపిలు గజ్జల రాఘవేంద్రారెడ్డి, అమర్నాథ్‌ రెడ్డి, తహసీల్దార్‌లు హరినాధరావు, రవీంద్ర ప్రసాద్‌, ఎంపిడిఒలు మహబూబ్‌ ఖాన్‌, సుబ్బారెడ్డి, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌లు నాయబ్‌ రసూల్‌, మాదం మరియమ్మ, ఎంవిఎం రాజు, కెడిసిసి బ్యాంక్‌ డైరెక్టర్‌ నాసారి వెంకటేశ్వర్లు, ముస్లిం నాయకులు షేక్‌ ఆజాద్‌, నజీర్‌, ఆమీర్‌ భాష తదితరులు పాల్గొన్నారు.

➡️