శ్రీశైలంలో తగ్గని భక్తులరద్దీ

Dec 18,2023 19:49

దర్శనం కోసం క్యూలో నిల్చున భక్తులు

శ్రీశైలంలో తగ్గని భక్తులరద్దీ

ప్రజాశక్తి – శ్రీశైలం

శ్రీశైల క్షేత్రంలో భక్తులరద్దీ తగ్గకుండా కొనసాతోతుంది. వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గత మూడు రోజులుగా చలి తీవ్రత పెరిగినప్పటికీ చలిని లెక్కచేయకుండా తెల్లవారుజామున మూడు గంటల నుండి పాతాళ గంగలో స్నానాల ఆచరించి స్వామి అమ్మవారిని దర్శించుకుం టున్నారు. భక్తులు శీఘ్ర ,అతి శీఘ్ర, ఉచిత క్యూలైన్లలో వేచి ఉండి స్వామి వారిని అలంకారంలో దర్శించుకుంటున్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకు నేందుకు నాలుగు గంటల సమయం పడుతుందని భక్తులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు తెల్లవారుజామున మూడు గంటలకి ఆలయ ద్వారాలు తెరిచి మహా మంగళహారతి అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చారు. దర్శనానికి క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తు లకు ఉచితంగా మంచినీరు అల్పాహారం బిస్కెట్లు అందజేస్తున్నారు. క్షేత్ర పరిధిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ద్వారా కంట్రోల్‌ రూమ్‌లో పర్యవేక్షిస్తున్నారు. డిఎస్పి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు నిరంతరం క్షేత్ర పరిధిలో పర్యవేక్షిస్తున్నారు. లోక కళ్యాణం కోసం దేవస్థానం నిర్వహించే పూజలలో భాగంగా సోమవారం నాడు కుమార స్వామికి సుబ్రమణ్య స్వామికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. అదేవిధంగా భక్తులను అలరించేందుకు దేవస్థానం ఏర్పాటుచేసిన కళారాధన కార్యక్రమంలో భాగంగా దక్షిణ మాడ వీధిలో సంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

➡️