ప్రశాంత ఎన్నికలే ధ్యేయం

Apr 13,2024 21:13

పట్టణంలో కవాతు నిర్వహిస్తున్న దృశ్యం

ప్రశాంత ఎన్నికలే ధ్యేయం
– ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలి
– ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకే పోలీసుల కవాతు
– జిల్లా ఎస్‌పి కె.రఘువీర్‌ రెడ్డి
ప్రజాశక్తి – ఆళ్లగడ్డ
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే పోలీసుల ధ్యేయమని, ప్రజలు కూడా స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని నంద్యాల జిల్లా ఎస్‌పి కె.రఘువీర్‌ రెడ్డి కోరారు. శనివారం కేంద్ర సాయుధ బలగాలతో కలిసి ఆళ్లగడ్డ స్థానిక పోలీసులతో పట్టణంలోని పలు ప్రాంతాలలో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకే పోలీసులతో కవాతు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించరాదన్నారు. ఎక్కడ ఎలాంటి గొడవలు, అల్లర్లు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, కొందరిని బైండోవర్‌ చేశామన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. కుల, మత, వర్గాల మధ్య విద్వేషాలకు, విభేదాలకు దారి తీసే విధంగా ప్రసంగాలు చేయరాదని,సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టరాదన్నారు. తప్పుడు సమాచారాన్ని లేదా తెలియని సమాచారాన్ని సోషల్‌ మీడియా ద్వారా మరి ఏ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేయరాదని తెలిపారు. మార్ఫింగ్‌ చేసిన ఫోటోలు, వీడియోలు పెట్టరాదని సూచించారు. వివాదాస్పద పోస్టింగులు వాట్సాప్‌లలో పెడితే అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ డిఎస్‌పి ఎస్‌.షర్ఫుద్దీన్‌, ట్రైనింగ్‌ డిఎస్‌పి రఘువీర్‌, టౌన్‌ ఇన్స్పెక్టర్‌ రమేష్‌ బాబు, ఎస్‌ఐ నగీనా, రూరల్‌ ఇన్స్పెక్టర్‌ హనుమంత్‌ నాయక్‌, రూరల్‌ ఎస్సై నరసింహులు, కేంద్ర సాయుధ బలగాల అధికారులు, సిబ్బంది, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.

➡️