ఫిబ్రవరి 16న రవాణా రంగ కార్మికుల దేశవ్యాప్త సమ్మె : సిఐటియు

Feb 11,2024 16:57 #Kurnool

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : భారతీయ న్యాయ సహిత (బి.ఎన్‌.ఎస్‌) చట్టం 2023లోని సెక్షన్‌ 106(1)డ(2) రద్దు చేయాలని కోరుతూ ఈనెల 16న జరిగే రోడ్డు రవాణా రంగకార్మికుల దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం కర్నూలులోని కార్మిక కర్షక భవన్‌లో ఆటో యూనియన్‌ జిల్లా నాయకులు బి.రాధాకృష్ణ అధ్యక్షతన సిఐటియు, ఏఐటియుసి అనుబంధ రవాణా రంగ కార్మిక సంఘాల ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్‌టిసిస్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) రాష్ట్ర కోశాధికారి జె.దివాకర్‌, కర్నూలు జిల్లా సిఐటియు అధ్యక్షులు పి.ఎస్‌.రాధాకృష్ణ. ఆటో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌, సిఐటియు న్యూ సిటీ కార్యదర్శి ఆర్‌.నరసింహులు, ఏఐటీయూసీ నగర ఆటో యూనియన్‌ కార్యదర్శి కృష్ణారెడ్డి (కిట్టు) పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రోడ్డు కండిషన్‌, వెహికల్‌ కండిషన్‌ మరియు డ్రైవర్ల యొక్క పని భారాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రమాదం జరిగితే డ్రైవర్లను దోషిగా చేస్తూ శిక్షించే విధానాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని సమావేశం డిమాండ్‌ చేశారు. రవాణా రంగ కార్మికులందరికీ కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని, అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించాలని, పని పరిస్థితులను మెరుగుపరచాలన్నారు. 16వ తేదీ జరిగే సమ్మెకు ఆటోల బంద్‌, రవాణా రంగ కార్మికుల సమ్మెకు స్కూలు యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు సానుభూతితో సహకరించి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా 13 వ తేదీన జీపు జాత, రవాణా రంగ కార్మికుల అందరి నుండి బి.ఎన్‌.ఎస్‌ చట్టానికి వ్యతిరేకంగా సంతకాల సేకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, జిల్లా కార్యదర్శి మహమూద్‌, రవి ఏఐటియుసి. ఆటో యూనియన్‌ అధ్యక్షులు రాము ,నగర నాయకులు ఈశ్వర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️