బోధకులేరీ?

May 15,2024 21:44

సీతంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను హైస్కూల్‌ ప్లస్‌గా ప్రభుత్వం మార్చింది. కానీ అందుకు తగ్గట్టు బోధకులను నియమించడం, వసతులు కల్పించడంపై దృష్టిసారించడం మరిచింది. ఓవైపు ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ కూడా ప్రారంభించారు. మరో 15 రోజుల్లో తరగతులు కూడా ఆరంభించేందుకు సిద్ధమవుతున్నారు. అధ్యాపకుల నియామకాన్ని విస్మరించారు. ఇంటర్‌ బోధనకు అనుగుణంగా ల్యాబ్‌ల ఏర్పాటు, ఇతర సౌకర్యాల కల్పనపై నేటికీ దృష్టిపెట్టలేదు. విద్యాశాఖ అధికారుల ముందుచూపు లేని నిర్ణయాలతో ఎక్కడ తమ పిల్లలకు సరైన విద్య అందదోనని తల్లిదండ్రులు.. ఆ కళాశాలలో చేర్పించేందుకు సందేహిస్తున్నారు.

ప్రజాశక్తి-సీతంపేట :  సీతంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను హైస్కూల్‌ ప్లస్‌ అప్‌గ్రేడ్‌ చేస్తూ 2023లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది జూన్‌ ఒకటో తేది నుంచి కళాశాల ప్రారంభించాలని నిర్ణయంచింది. అధికారులకు సర్క్యులర్‌ జారీ చేసింది. కో ఎడ్యుకేషన్‌ కళాశాలలో ప్రవేశాలకు ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించారు. బైపిసి, ఎంపిసి, సిఇసి గ్రూపులు కేటాయించారు. విద్యార్థులు ఏ గ్రూపుల వైపు మొగ్గుచూపుతారో ఆ రెండు గ్రూపులు మాత్రమే నిర్వహిస్తామని, మిగతా గ్రూపు తొలగిస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. హై స్కూల్‌ ప్లస్‌లో బోధించడానికి పాఠశాల నుంచి అర్హత ఉన్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. దానికి సంబంధించి ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు, హైస్కూల్‌ ఉపాధ్యాయులను కేటాయిస్తారా, లేదా ప్రత్యేకంగా పిజిటి ఉపాధ్యాయులను మంజూరు చేస్తారా? అనే సందిగ్ధంలో విద్యార్థులు , ఉపాధ్యాయులు ఉన్నారు. దీంతోపాటు ఎంపిసి, బైపిసి గ్రూపులు ఏర్పాటుచేస్తే, ల్యాబులు తప్పనిసరి. ఇంతవరకూ అవేవీ ఏర్పాటుచేయలేదు. టేబుళ్లు, బెంచీలు కూడా లేవు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 240 మంది విద్యార్థులకు సరిపడా గదులు ఉన్నాయి. మరుగుదొడ్లు మాత్రం చాలీచాలనివి ఉన్నాయి. ఇప్పుడు కళాశాలగా అప్‌గ్రేడ్‌ అయ్యాక ఒక్కో గ్రూపు నుంచి 40 మంది చొప్పున రెండు గ్రూపులకు 80 మంది విద్యార్థులు కొత్తగా చేరుతారు. అందుకు సరిపడా మరుగుదొడ్లు, వసతులు లేవు. ఇంకా కళాశాల ప్రారంభించడానికి 15 రోజులు మాత్రమే ఉంది. ఈ కాలంలో బోధకులు, బోధనేత సిబ్బంది, అదనపు గదులు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు.. ఏర్పాటు సాధ్యమవుతుందా? అధికారులు పూర్తిచేయగలరా? అని విద్యార్థులు, తల్లిదండ్రులు సందేహ పడుతున్నారు. సీతంపేటలో జూనియర్‌ కళాశాల లేదు. దానికి తోడు ఈ కళాశాల మంజూరు చేయడం వల్ల మరింత డిమాండ్‌ పెరుగుతుంది. మండలంలో ఈ ఏడాది గురుకులాలు, ఆశ్రమ ఉన్నత పాఠశాలల నుంచి దాదాపు రెండు వేల మంది విద్యార్థులు పదో తరగతిలో ఉత్తీర్ణత చెందారు. కళాశాల ప్రవేశాలకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు. దీనిపై ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు హేమసుందర్‌ వద్ద ప్రజాశక్తి ప్రస్తావించగా ఈ నెల 25వ తేదికి పిజిటి బోధకులను నియమిస్తారని చెప్పారు. జూన్‌ ఒకటో తేదీ నుంచి హైస్కూల్‌ ప్లస్‌ క్లాసులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ నెల 15వ తేదీ కల్లా విద్యార్థుల ప్రవేశాలు జాబితా విద్యా శాఖకు పంపిస్తామని వెల్లడించారు. ఇప్పటికే 27 మంది విద్యార్థులను అడ్మిషన్లు జరిగాయని తెలిపారు.

➡️