కంటి క్యాన్సర్‌కు అరుదైన చికిత్స

May 4,2024 21:53

ప్రజాశక్తి – హెల్త్‌ యూనివర్సిటీ : తమ ఆసుపత్రిలో కంటి క్యాన్సర్‌కు అరుదైన చికిత్సను విజయవంతంగా చేసినట్టు నగరంలోని కోడే వెంకటాద్రి చౌదరి క్యాంపస్‌ హెడ్‌ ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ (ఎల్విపిఈఐ) ఓక్యులర్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ అనసూయ గంగూలీ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రెటినోబ్లాస్టోమా కంటి క్యాన్సర్‌తో బాధపడుతున్న 4 ఏళ్ల బాలికకు మొట్టమొదటి సారిగా ఇంట్రా-ఆర్టీరియల్‌ కెమోథెరపీ (ఐఎసి) చికిత్సను అత్యంత విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ చికిత్స కోసం ఆ బాలికకు 12 ఇంట్రావీనస్‌ కీమోథెరపీలను పూర్తీ చేసినప్పటికీ, ఒక కంటిలో కణితి పునరావృతం కావటం వల్ల ఇంట్రా-ఆర్టీరియల్‌ కెమోథెరపీ (ఐఎసి) నిర్వర్తించాలని నిర్ణయించామన్నారు. ఈ ఇంట్రా-ఆర్టీరియల్‌ కెమోథెరపీ (ఐఎసి) రెటినోబ్లాస్టోమా చికిత్స కోసం ప్రత్యేకంగా ప్రభావవంతమైన సమర్థవంతమైన క్యాన్సర్‌ రహిత ఔషధాలను నేరుగా కంటిలోనికి పంపిస్తుందన్నారు. ఈ చికిత్స విధానం పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ, మన భారత దేశంలో పరిమితమైన మౌలిక సదుపాయాలూ ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా ఉన్నాయన్నారు. ఈ ఇబ్బందులను అధిగమించి ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ (ఎల్‌విపిఈఐ)లో ఈ చికిత్సా విధానానికి తగిన వనరులు అత్యంత నైపుణ్యతతో దిగ్విజయంగా పూర్తిచేశామన్నారు. తమ ఇన్స్టిట్యూట్లో రెటినోబ్లాస్టోమా రోగుల కోసం అధునాతన చికిత్సా పద్ధతులు ఉన్నాయన్నారు. ఈ సంక్లిష్టమైన చికిత్స విజయవంతం చేయటంలో డా.లక్ష్మి ప్రసన్న.కె, ఇంటర్వెన్షనల్‌ రేడియాలజిస్ట్‌, లలిత హాస్పిటల్‌, గుంటూరు, డా.వీణా అక్కినేని, పీడియాట్రిక్‌ ఆంకాలజిస్ట్‌, రెయిన్‌ బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌, డా శ్రీదేవి.వి సీనియర్‌ ఎనస్తీషియన్‌, పయనీర్‌ ఎనస్తీషియా గ్రూపు, విజయవాడ వారు ఎంతో సహకరించారన్నారు.

➡️