నగరంలో కృష్ణమ్మ చిత్ర యూనిట్‌ సందడి

Apr 25,2024 22:32

జయవాడ నగరంలో కృష్ణమ్మ చిత్ర బృందం సందడి చేసింది. బెజవాడ నగరం ఇతివృత్తంగా నగరంలో 60 రోజులపాటు కృష్ణమ్మ చిత్రాన్ని నిర్మించామని ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక విజయవంతం చేయాలని హీరో సత్యదేవ్‌ కోరారు. స్టెల్లా కాలేజ్‌ సమీపంలోని హివాగా స్కూల్‌ ఆఫ్‌ బ్యూటీ సెంటర్లో కృష్ణమ్మ చిత్ర బృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో హీరో సత్యదేవ్‌ మాట్లాడుతూ కృష్ణమ్మ చిత్రాన్ని విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్మించినట్లు తెలిపారు. ముఖ్యంగా వన్‌టౌన్‌ వించిపేట కొండ ప్రాంతంలో, మూలపాడు అటవీ ప్రాంతంలో సినిమా చిత్రీకరణ జరిగిందన్నారు. ఈ చిత్రంలో తాను వించిపేట భద్ర క్యారెక్టర్‌లో ప్రేక్షకులకు కనబడతానని చెప్పారు. ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే కథే ఈ చిత్రమని తెలిపారు. మే మూడో తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారని చిత్రంలో ఉన్న కంటెంట్‌ నచ్చి ఆయన ప్రజెంట్‌ చేయడానికి ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం దర్శకుడు వివి.గోపాలకృష్ణ మాట్లాడుతూ తాను విజయవాడ నగరంలోనే పుట్టి పెరిగానని విజయవాడ ఇతివృత్తంగా విజయవాడ అందాలను ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో కృష్ణమ్మ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ చిత్రంలో సత్యదేవ్‌ పాత్ర పవర్ఫుల్‌గా ఉంటుందని ఆయన నటన సహజంగా ప్రేక్షకులకు కచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని చెప్పారు. స్నేహానికి ఉన్న విలువను కృష్ణమ్మ చిత్రంలో చూపించినట్లు ఆయన వివరించారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌ ఉన్నారని కథ పరంగా వారి పాత్ర కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు. రఘు కుంచే, అర్చన, నందగోపాల్‌, లక్ష్మణ్‌, కృష్ణ తదితరులు చిత్రంలో వారి పాత్రలకు న్యాయం చేశారని చెప్పారు. అనంతరం హీరోయిన్‌ అర్చన అయ్యర్‌ మాట్లాడుతూ కృష్ణమ్మ చిత్రంలో తాను పద్మ అనే క్యారెక్టర్‌లో కనబడతానని క్యారెక్టర్‌ పేక్షకులకు హత్తుకునేలా ఉంటుందని చెప్పారు.

➡️