పోస్టల్‌ బ్యాలెట్‌ నమోదును ఉపయోగించుకోండి-

May 6,2024 21:59
  • ఎన్టీఆర్‌ జిల్లా ఎన్జీవో సంఘం అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్‌

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ నమోదు చేయని వారికి ఆఖరి అవకాశంగా 7, 8 తారీకులలో పోస్టల్‌ బ్యాలెట్‌ ను వేసుకునే సౌకర్యాన్ని కల్పించారని, దాని ఉద్యోగులంతా సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్‌, కార్యదర్శి ఎండి ఇక్బాల్‌ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. 5, 6 తారీకుల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ని వినియోగించుకోలేని ఉద్యోగులు, ఫార్ములాని దాఖలు చేయని ఉద్యోగులు, నేరుగా వారి ఓటు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం ఆర్‌ఓ ఆఫీసులో ఏర్పాటుచేసిన పోలింగ్‌ బూత్‌లో ఓటును వేయాలని కోరారు. ఆర్వో ఆఫీసుల వద్దే ఫారం 12 ను పూర్తి చేయించి ఓటు వేసుకునే సదుపాయాన్ని కలిగిస్తారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి సబ్‌ కలెక్టర్‌ ఆఫీసు ప్రాంగణంలోనూ, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గానికి సంబంధించి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫీస్‌ ప్రాంగణంలోనూ, విజయవాడ పశ్చిమానికి సంబంధించి భవానిపురం, ఎమ్మార్వో ఆఫీస్‌ వద్ద ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ తిరువూరు నియోజకవర్గాలకు సంబంధించి ఆయా ఆర్వో ఆఫీసుల్లో ఆ నియోజకవర్గ ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించు కోవాలని కోరారు. స్థానిక ఎన్జీవో హోంలో సోమవారం జరిగిన ఉద్యోగ సంఘాల నాయకుల సమావేశంలో ఎన్జీవో సంఘ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌ ఇదే అంశంపై సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్లోనూ, విద్యాలయాల్లోనూ మిగిలిన, ఓటు హక్కు వినియోగించుకోలేని ఉద్యోగులందరి దృష్టికి తీసుకుని వెళ్లి వారిని పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించుకునేలా చూడాలని కోరారు. జిల్లా కార్యదర్శి ఎం.డి.షేక్‌ బాబు మాట్లాడుతూ ఉద్యోగుల కుటుంబ సభ్యులు, పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు కూడా బాధ్యతగల పౌరులుగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వారందరూ వినియోగించుకునేట్లు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పి.రమేష్‌, రాజబాబు, సిహెచ్‌ దిలీప్‌ కుమార్‌, విశ్వనాథ్‌, నాగేంద్ర, నగర శాఖ నాయకులు శ్రీరామ్‌, మధుసూదన్‌, గణేష్‌, రాధాకృష్ణ మహిళా విభాగం నాయకురాలు శివలీల పాల్గొన్నారు.

➡️