కార్మికోద్యమానికి అంకితమైన పర్స సత్యనారాయణ

May 22,2024 21:56

మాట్లాడుతున్న గుంటూరు విజరుకుమార్‌
ప్రజాశక్తి-సత్తెనపల్లి :
కార్మికవర్గ ఉద్యమాలకే తన జీవితాన్ని అంకితాన్ని పర్స సత్యనారాయణ అంకితం చేశారని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్‌ అన్నారు. బుధవారం స్థానిక పుతుంబాక భవన్‌లో పర్స సత్యనారాయణ వర్ధంతి సభ సిపిఎం నాయకులు గుంటుపల్లి బాలకృష్ణ అధ్యక్ష తన నిర్వహించారు. విజరు కుమార్‌ మాట్లాడుతూ సత్తెనపల్లి తాలూకాలో జన్మించిన పర్స సత్యనారాయణ తెనాలి, దుగ్గిరాల, హైదరాబాదులలో చదువు పూర్తి చేసుకొని సింగరేణి బొగ్గు గనుల్లో కార్మికునిగా చేరారని తెలిపారు. అక్కడ కార్మికుల స్థితిగతులను, కష్ట నష్టాలను అర్థం చేసుకుని కార్మిక సంఘాలను నిర్మించి కార్మికోద్యమాలను నడిపారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన కార్మిక సంఘం నాయకునిగా గుర్తింపు పొందార న్నారు. అయితే కార్మికుల ఉద్యమాలను నిర్వీర్యం చేయాలని ఉద్దేశంతో అక్కడి యాజమాన్యం ఆయనను విధుల నుండి బహిష్కరించిందని, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న పర్సా సత్యనారాయణ తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కార్మిక ఉద్యమానికే అంకితమయ్యారని తెలిపారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, ఆయన ఆశయాల సాధన కోసం పని చేయడమే ఆయనకు అర్పించే నివాళని అన్నారు. తొలుత పర్స సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు గద్దె చలమయ్య, పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎవిఎన్‌ గోపాలరావు, నాయకులు హనుమంత్‌రెడ్డి, శివకుమారి, జె.రాజకుమార్‌, పెద్దిరాజు, జి.రజిని, బి.రామచంద్రరావు పాల్గొన్నారు.

➡️