చంద్రబాబు వల్లే పింఛనుదార్లకు కష్టాలు

May 3,2024 21:30

ప్రజాశక్తి – సాలూరు : రాష్ట్రంలో సజావుగా సాగుతున్న వాలంటీర్‌ వ్యవస్థపై టిడిపి, జనసేన పార్టీలు ఫిర్యాదు చేయడం వల్లనే గత రెండు నెలలుగా పింఛను లబ్దిదారులకు కష్టాలు మొదలయ్యాయని డిప్యూటీ సిఎం రాజన్నదొర ఆరోపించారు. శుక్రవారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గడచిన నాలుగున్నరేళ్లుగా ఇంటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఫించన్లను వాలంటీర్లు అందజేశారని చెప్పారు. నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లపై టిడిపి నాయకులు ఫిర్యాదు చేయడం వల్ల ఎన్నికల సంఘం వారిని విధులకు దూరంగా పెట్టిందని చెప్పారు. గత రెండు నెలలుగా పింఛను లబ్దిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందు లకు కారణం చంద్రబాబేనని అన్నారు. దీనిపై ఎల్లో మీడియా ఇష్టారాజ్యంగా తప్పుడు ప్రచారం చేస్తోందని, జగన్‌ మోహన్‌ రెడ్డి కారకుడనేలా టిడిపి మీడియా రాతలు రాస్తోందన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో పింఛను డబ్బులు అందుకోడానికి వెళ్లి వృద్ధులు, వికలాంగులు మరణించడానికి టిడిపి నాయకులే ప్రధాన కారణమని ఆరోపించారు. వాలంటీర్‌ వ్యవస్థపై మొదటి నుంచి అక్కసు వెళ్లగక్కుతున్న టిడిపి, జనసేన పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని రాజన్నదొర అన్నారు.మరో అవకాశం ఇవ్వాలిమరోసారి తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సీఎం రాజన్నదొర కోరారు. పట్టణంలోని 28,14 వార్డుల్లో ఆయన ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరిస్తానని చెప్పారు. రాష్ట్రంలో మరోసారి వైసిపి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. లేకపోతే పేదలే తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు జెసిఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు కౌన్సిలర్లు బలబద్రుని శ్రీనివాసరావు,పాలవలస మధుసూదనరావు పాల్గొన్నారు.కురుకూటిలో…మండలంలోని పెదబారి గాం, చిన బారిగాం గ్రామాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ రెడ్డి పద్మావతి వైసిపి ఎస్టీ సెల్‌ కన్వీనర్‌ కొండగొర్రి ఉదరు కుమార్‌తో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిం చారు. గిరిజన సమస్యలు పరిష్కారం కావాలంటే వైసిపి ప్రభుత్వం అధికార ంలోకి రావాలన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు గొర్లి రాజారావు, సువార్తరావు ఎంపిటిసి సుబ్బారావు పాల్గొన్నారు.మక్కువ : మండలంలోని పనసభద్ర పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామాల్లో వైసిపి ప్రచారం చేపట్టింది. వైసిపి మండల నాయకులు ఎం.రంగు నాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. చిలకమండంగి, బాగుజోల, గుంట భద్ర, దుగ్గేరు, మూలవలస తదితర గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్నదొరను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌, ఎంపిటిసి సభ్యులు, వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️