ఔత్సాహిక పారిశ్రామికవేత్తల దరఖాస్తులపై అనుమతులు జారీ చేయాలి : కలెక్టర్

Feb 21,2024 17:30 #collector, #Kakinada
ప్రజాశక్తి కాకినాడ : సింగిల్ డెస్క్ విధానం క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుండి అందిన ధరఖాస్తులపై త్వరితగతిన అనుమతులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కోర్టు హలులో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ  సమావేశం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన జరిగింది.  సమావేశంలో సింగిల్ డెస్క్ విధానం క్రింద గడచిన త్రైమాస కాలంలో అందిన ధరఖాస్తుల పరిష్కారం, చిన్న, మద్య తరహా పరిశ్రమల ప్రోత్సాహనికి వివిధ రాయితీల మంజూరు అంశాలపై ఆమె సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు.  ఈ సందర్భంగా జిల్లాలో గత త్రైమాస కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ మొత్తం 172 ధరఖాస్తులు అందగా, సింగిల్ డెస్క్ విధానంలో ఆయా శాఖల ద్వారా 148 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసారని, 19 ధరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు.  మరో 5 ధరఖాస్తులను తిరస్కరించడం జరిగిందని తెలిపారు.   పరిశీలనలో ఉన్న ధరఖాస్తులన్నిటిపై నిర్థిష్ట గడువు లోపున తగిన పరిష్కారం అందించాలని పర్యావరణ పరిరక్షణ, ఫాక్టరీస్, అగ్నిమాపక శాఖల అధికారులను ఆదేశించారు. తదుపరి  చిన్న,మద్యతరహా పరిశ్రమల ప్రోత్సాహం కొరకు పావలవడ్డీ, విద్యుత్, సేల్ టాక్స్, స్టాంపు డ్యూటీ  తదితర రాయితీల క్రింద జిల్లాలో ఉత్పాదన, సేవా రంగాల్లోని 39 యూనిట్లకు మొత్తం ఒక కోటీ 10 లక్షల విలువైన రాయితీ ప్రయోజనాల జారీకి కమిటీ ఆమోదం తెలియజేసింది.  ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జియం టి.మురళీ, ఎల్డిఎం సిహెచ్ఎస్వీ ప్రసాద్, డిపిఓ కె.భారతి సౌజన్య, డిప్యూటీ ఛీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ డి.రాధాకృష్ణ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ఎన్.సందీప్, రవాణా శాఖా అధికారి పి.వి.సాయిప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
➡️