పల్నాడు జిల్లాపై పోలీసుల డేగకన్ను

May 12,2024 23:55

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలపై ఎన్నికల కమిషన్‌ ప్రత్యేకంగా దృష్టిసారించింది. జిల్లా పరిధిలో నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కువగా ఘర్షణలు జరగడానికి అవకాశం ఉన్నట్టుగా గుర్తించింది. మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో సమస్యాత్మక గ్రామాలపై పోలీసు అధికారులు దృష్టి సారించారు. ప్రధానంగా ఘర్షణలు జరగడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా విధించాలని నిర్ణయించారు. 6 వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 20 కంపెనీల కేంద్ర బలగాలు పల్నాడు జిల్లాకు చేరుకున్నాయి. జిల్లాలో 558 సమసాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించినట్టు ఎస్‌పి గరికపాటి బిందు మాధవ్‌ తెలిపారు. ఆయా కేంద్రాలకు పారా మిలటరీ బలగాలను రప్పించారు. మాచర్ల నియోజకవర్గంలో ఒక ఎస్‌పి అధికారిని పర్యవేక్షణకు నియమించారు. ఇతర నియోజకవర్గాలకు అదనపు ఎస్‌పి లను పర్యవేక్షకులుగా నియమించారు. గురజాల నియోజకవర్గం పరిధిలో పొందుగల చెక్‌పోస్టు వద్ద నిఘా ఉన్నా అక్రమ మద్యం జిల్లాకు వస్తోందన్న విమర్శలున్నాయి. 2019 ఎన్నికల్లో పల్నాడు జిల్లాలోనే ఎక్కువ గ్రామాల్లో టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య దాడులు జరిగాయి. రాజుపాలెం మండలంలో అప్పటి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై కూడా దాడి జరిగింది. మాచర్ల, గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో సమస్యాత్మక గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 300 గ్రామాల్లో పరస్పర ఘర్షణలకు ఆస్కారం ఉందని అంచనాతో పారా మిలటరీ దళాలను ఎక్కువగా వినియోగించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈసారి 2019 కన్నా ఘర్షణలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. పోలింగ్‌ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుండటంతో ఆదివారంరాత్రి గ్రామాల్లో పోలీసులు విస్తృతంగా సంచరిస్తున్నారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వకుండా దుకాణాలు, వ్యాపార సంస్థలను మూయిస్తున్నారు.

➡️