నేడే పోలింగ్‌

సమయం ఆసన్నమైంది. ఎన్నికల్లో అంత్యంత కీలక ప్రక్రియ మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. కడప, అన్నమయ్య జిల్లాలోని రెండు లోక్‌సభ, 13 శాసనసభ స్థానాలకు సోమవారం జరగనున్న ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్దమైంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు ఓటర్లు తమ ఓటు ద్వారా తీర్పు ఇవ్వనున్నారు. ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా జడగడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. రెండు జిల్లాల్లో 30.65 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం 3,104 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎన్నికల క్రతువుకు సంబంధించిన సమస్మాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించింది. అందుకు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. 22,357 ఎన్నికల అధికారుల నియామకం, సామగ్రి తరలింపు, శాంతిభద్రతల పర్యవేక్షణపై దృష్టి సారించింది.ప్రజాశక్తి – కడప ప్రతినిధి సార్వత్రిక ఎన్నికల వ్యవహారం క్లైమాక్స్‌కు చేరుకుంది. జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం సోమవారం నాటి పోలింగ్‌ నిర్వహణకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లూ చేసింది. కడప పార్లమెంట్‌ స్థానానికి 14 మంది, జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు 110 మంది అభ్యర్థులు, రాజంపేట పార్లమెంట్‌ స్థానానికి 18 మంది, ఆరు అసెంబ్లీ స్థానాలకు 70 మంది బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. వీరిని కడప జిల్లాలో 16,39,066 లక్షల ఓటర్లు, అన్నమయ్య జిల్లాలో 14,26,834 లక్షల మంది ఓటర్లు ఎన్నుకో నున్నారు. జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కడప జిల్లాలో 2,035, అన్నమయ్య జిల్లాలో 1,069 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కడప జిల్లాలో 14,640 మంది పోలింగ్‌ సిబ్బందిని, అన్నమయ్య జిల్లాలో 7,717 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించింది. అదనంగా 527 క్రిటికల్‌, 14 వల్నరబుల్‌ పోలింగ్‌ కేంద్రాలను గుర్తించింది. 1,222 వెబ్‌కాస్టింగ్‌, 741 వీడియోగ్రఫీ, 610 మైక్రోఅబ్జర్వర్లు, 2,334 ప్రిసైడింగ్‌ ఆపీసర్స్‌, 2,336 ఎపిఎలు, 9360 ఓపిఓలను నియమించింది. అన్నమయ్య జిల్లాలోని 1,609 పోలింగ్‌ కేంద్రాలకు 1,926 మంది ప్రిసైడింగ్‌ ఆఫీ సర్స్‌, 1,929 మంది ఎపిఒలు, 7,717 మంది ఓపిఓలు, 482 మంది మైక్రోఅబ్జర్వర్లతోపాటు వేలాది మంది పోలీస్‌ సిబ్బందితో ఎన్నికలను పర్యవేక్షిస్తోంది. జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం వృద్ధులకు, వికలాంగులకు పోలింగ్‌కేంద్రాల దగ్గర రెయిలింగ్‌ సదుపాయాలను ఏర్పాటు చేసింది. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనుంది. ఆదివారం మాక్‌ పోలింగ్‌ను సైతం నిర్వహించింది. అనంతరం సోమవారం పూర్తి స్థాయి పోలింగ్‌ నిర్వహణకు సంబంధించిన పోలింగ్‌ సామగ్రిని అందించింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు ఆర్టీసీ వాహనాల్లో ఎన్నికల సిబ్బంది చేరు కోవాలని ఆదేశించింది. ఆది వారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం ఏడు గంటల సమయానికి పోలింగ్‌ సామగ్రిని అమర్చుకుని పోలింగ్‌ నిర్వహణకు సిద్ధంగా ఉండాల్సి ఉంది. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు సంబం ధించి ఈనెల 11 నుంచి జూన్‌ 11 వరకు 144 సెక్షన్‌ అమలు ఉండడంతోపాటు కడప జిల్లాలో మూడు వేల మంది సాధారణ పోలీస్‌ బందోబస్తుతోపాటు కర్నాటక, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి హోంగార్డులు, కేంద్రబలగాలతో కలిసి ఐదు వేల మంది పోలీసులు, అన్నమయ్య జిల్లాలో 144 సెక్షన్‌ అమలుతో పాటు 11 కంపెనీల సిఆర్‌పిఎఫ్‌, ఒక కంపెనీ ఎపిఎస్పీ బలగాలతోపాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అదనపు బలగాలను మోహరించింది.

➡️