ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు

May 25,2024 20:40

నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి

జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి

కౌంటింగ్‌ సిబ్బందికి శిక్షణ

ప్రజాశక్తి-విజయనగరంకోట  : జూన్‌ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ముందుగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుందని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి తెలిపారు. ఈ ప్రక్రియ ఉదయం 8 గంటలకల్లా ఖచ్చితంగా ప్రారంభించాలని ఆదేశించారు. కౌంటింగ్‌ సిబ్బంది అంతా ఉదయం 6 గంటలకే లెక్కింపు కేంద్రాలవద్దకు చేరుకొని, అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకోవాలని సూచించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు మొదలైన తరువాత, ఉదయం 8.30 గంటలకు ఈవిఎం ఓట్ల లెక్కింపును మొదలు పెట్టాలని చెప్పారు. ఓట్లను లెక్కించే కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, సహాయకులకు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మొదటి విడత శిక్షణా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. లెక్కింపు ప్రక్రియలో వివిధ న్యాయపరమైన అంశాలు, సిబ్బంది విధులు, నిబంధనలు, కౌంటింగ్‌ హాళ్లు, పోస్టల్‌ బ్యాలెట్లు, ఇవిఎం ఓట్లు లెక్కించే విధానం, టేబుళ్ల ఏర్పాటు, చెల్లని ఓట్లు, చెల్లినవి గుర్తించడం, వాటిని వేరు చేయడం, ఫలితాలను నింపడం, బోర్డుపై వెళ్లడించడం, అవసరమైన పత్రాలను పూర్తి చేయడం, తిరిగి ఇవిఎంలను సీల్‌ చేయడం, స్ట్రాంగ్‌ రూములోకి తరలించడం తదితర అంశాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కడా సొంత నిర్ణయాలను తీసుకోకూడదని స్పష్టం చేశారు. జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కోసం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడు కేంద్రాలు, మొత్తం పార్లమెంటు స్థానం ఓట్ల లెక్కింపు కోసం లెండి కళాశాలలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ పోస్టల్‌ ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో కేంద్రంలో నాలుగు టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పార్లమెంటు స్థానం పోస్టల్‌ ఓట్ల లెక్కింపు కోసం 20 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కౌంటింగ్‌ సిబ్బంది గానీ, ఏజెంట్లు గానీ, ఇతర అధికారులు గానీ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డు కలిగి ఉండాలని తెలిపారు. కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇవిఎంలలో ఓట్లను లెక్కించడానికి ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక కేంద్రం, ఆ నియోజకవర్గంలో పార్లమెంటుకు పోలైన ఓట్ల లెక్కింపు కోసం మరో లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ వివరించారు. ఇవిఎం ఓట్ల లెక్కింపు కేంద్రంలో వరుసకు ఏడు చొప్పున మొత్తం 14 టేబుళ్లు ఉంటాయన్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రారంభమవుతుందని, అరగంట తరువాత ఈవిఎం ఓట్ల లెక్కింపు మొదలుపెట్టాలని ఆదేశించారు. మొదట విడతలో మొత్తం పోస్టల్‌ బ్యాలెట్ల చెల్లుబాటును పరిశీలించాలని, అది పూర్తయ్యాక రెండో విడతలో పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను పరిశీలించి, పార్టీల వారీగా వేరుచేసి, అనంతరం ఓట్లను లెక్కించాలని తెలిపారు. ఒక్కో రౌండ్‌కు ఒక టేబుల్‌కు 500 ఓట్లను కట్టకట్టి ఇవ్వడం జరుగుందన్నారు. ఇదే సమయంలో సర్వీసు ఓటర్లకు సంబంధించిన ఇటిపిబిఎంఎస్‌ ఓట్ల లెక్కింపు కూడా నిర్వహించాలన్నారు. ఎవరిని ఏ ఓట్ల లెక్కింపునకు కేటాయిస్తారో ముందుగా తెలియదని చెప్పారు. కౌంటింగ్‌ కేంద్రం లోపల ఆర్‌ఓ వద్ద అభ్యర్ధి లేదా జనరల్‌ ఏజెంట్‌ కు మాత్రమే కూర్చొనే అవకాశం ఉంటుందని, ఇతర ఏజెంట్లు, ప్రజాప్రతినిధులకు ప్రవేశం లేదని స్పష్టం చేశారు. అన్ని లెక్కింపు కేంద్రాల్లో సిసి కెమేరాలు ఉంటాయని, వీడియో రికార్డింగ్‌ కూడా జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, ట్రైనింగ్స్‌ నోడల్‌ ఆఫీసర్‌ సుధాకరరావు, ఎలక్షన్‌ సెల్‌ సూపరింటిండెంట్‌ ప్రభాకరరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

➡️