ఉపాధి కూలీలకు 5 లక్షల బీమా

May 31,2024 14:21 #Prakasam District

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండ్
ప్రజాశక్తి-టంగుటూరు : మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల రక్షణకు 5 లక్షల బీమా పరిహారం ప్రభుత్వ కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని మర్లపాడులో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల పని ప్రదేశంలో వ్యవసాయ కార్మిక సంఘం బృందం పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ నివాస ప్రాంతాలకు దూరంగా నాలుగైదు కిలోమీటర్ల ప్రాంతంలో ఉపాధి పనులు జరుగుతున్నాయని, పని ప్రదేశము నుండి ఇంటికి వచ్చే సమయంలో ఎండ దెబ్బకు తట్టుకోలేకపోతున్నామని అనేకమంది కూలీలు తెలిపారు. పెరుగుతున్న ఎండలతోపాటు, వడగాలికి సొమ్మసిల్లి పడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి తోడు పని ప్రదేశంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పాముకాట్లు, తేలు కుట్టడం లాంటి సందర్భాల్లో తమకేటువంటి రక్షణ లేదని తెలిపారు. జిల్లా కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ ఉపాధి కూలీల రక్షణకు గతంలో ఉన్న50 వేల పరిహారాన్ని కూడా మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. నేడు అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలైనా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల ఫలితంగా గ్రామీణ పేదలకు పని దినాలు క్రమంగా తగ్గిపోతున్నాయని, పట్టణాలకు వలస పోయినా పనులు కూడా తగినంతగా లేవని అన్నారు. పట్టణాలకు కూడా ఉపాధి హామీని విస్తరించి పని కావాలన్న ప్రతి పేదవారికి ప్రభుత్వం పని కల్పించే విధంగా చట్టంలో మార్పు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం అధికారంలోకి రానున్న ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి చెందాలంటే ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచి పేదల జీవితాన్ని కాపాడడం ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వి. మోజస్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో టెంట్లు, మంచినీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. వాటికి కేటాయిస్తున్న నిధులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్ణయించిన మౌలిక వసతులన్ని కల్పించాలని, రోజు వేతనం 300 వచ్చేలా ప్రయత్నం చేయాలని కోరారు.

➡️